వరిపై ఎల్‌నినో ప్రభావం
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:21 AM
మండలంలో వరి సాగుపై ఎల్‌నినో ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. మండలంలో రైతులు 80 శాతం వరి నాట్లు పూర్తి చేసినప్పటికి ప్రస్తుతం పొలాలు నీరులేక ఎండిపోతున్నాయి.
ఎండిపోతున్న వరి నాట్లు
గూడెంకొత్తవీధి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో వరి సాగుపై ఎల్‌నినో ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. మండలంలో రైతులు 80 శాతం వరి నాట్లు పూర్తి చేసినప్పటికి ప్రస్తుతం పొలాలు నీరులేక ఎండిపోతున్నాయి. గత ఏడాది జూలై, ఆగస్టులో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూలై, ఆగస్టులో 45 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. అడపాదడపా గిరిజన ప్రాంతంలో వర్షాలు పడుతున్నప్పటికి వరి సాగుకి సరిపడడం లేదు. కొండవాగులు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు దిగువనున్న వరి పొలాలు మెరుగ్గా ఉన్నప్పటికి వర్షాధారంగా సాగు చేసే పొలాల్లో నీరు అందక నాట్లు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో మన్యంలో వర్షాలు పడకపోతే వరి పంటను పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.