Share News

అసంపూర్తి బడి భవనాలకు కదలిక

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:55 PM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను ఈ వేసవిలో పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ‘మనబడి నాడు- నేడు’ కింద చేపట్టిన అసంపూర్తి భవనాలతో పాటు కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది.

అసంపూర్తి బడి భవనాలకు కదలిక
అనకాపల్లి మండలం అచ్చెయ్యపేట పాఠశాలలో అసంపూర్తి భవనం

గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులతో పాటు కొత్త నిర్మాణాలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం

పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

జిల్లాలో రూ.11.87 కోట్లతో చేపట్టనున్న పనులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను ఈ వేసవిలో పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ‘మనబడి నాడు- నేడు’ కింద చేపట్టిన అసంపూర్తి భవనాలతో పాటు కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అనుమతులు ఇవ్వడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వైసీపీ నాయకులే బినామీలుగా అవతారమెత్తి పనులు చేపట్టడంతో అప్పట్లో కొన్ని పాఠశాలల ఖాతాల్లో నిధులు ఖర్చయినా భవనాలు మాత్రం పూర్తికాలేదు. మరికొన్ని చోట్ల అరకొర నిర్మాణాలతో పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అసంపూర్తి భవనాలన్నీ పూర్తి చేయాలనే సంకల్పించింది. మనబడి- మన భవిష్యత్తు ఫేజ్‌-2 కింద కొత్తగా అదనపు తరగతి గదులతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా సమగ్ర శిక్ష ఇంజనీరింగ్‌ అధికారులు జిల్లాలో అసంపూర్తి భవన నిర్మాణాలు, వాటిని పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధులపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో పాత, కొత్త కలిపి ఫేజ్‌-2 కింద మొత్తం 584 పాఠశాలల్లో 967 నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించి, ఇందుకు రూ.11.87 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించింది. ఈ వేసవి సెలవుల్లో పనులు వేగవంతం చేసి, పాఠశాలల పునః ప్రారంభం నాటికి అసంపూర్తి భవనాలతో పాటు, కొత్తగా నిర్మించాల్సిన తరగతి గదులను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సమగ్ర శిక్ష ఈఈ నర్సింగరావు తెలిపారు. జిల్లా నుంచి పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పరిపాలన పరమైన ఆమోదం ఇచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

Updated Date - Apr 25 , 2026 | 11:55 PM