Share News

బీఎన్‌ రోడ్డు పనుల్లో కదలిక

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:43 AM

మండల పరిధిలో ప్రధానమైన భీమిలి- నర్సీపట్నం (బీఎన్‌) రహదారి అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. వివిధ కారణాలతో నత్తనడక సాగుతున్న రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. వెంకన్నపాలెం నుంచి సబ్బవరం మండలం లింగాల తిరుగుడు వరకు పునరుద్ధరణ అయిన పనులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. వెంకన్నపాలెం- చోడవరం రోడ్డు పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా నిర్వహిస్తే వచ్చే నెల చివరినాటికి పూర్తయ్యే అవకాశం వుంది.

బీఎన్‌ రోడ్డు పనుల్లో కదలిక
అడ్డూరు- లింగాలతిరుగుడు మధ్య తారు రోడ్డు పనులు

వెంకన్నపాలెం- లింగాలతిరుగుడు మధ్య బీటీ లేయర్‌

ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయని అంచనా

చోడవరం- వెంకన్నపాలెం రహదారి పనులు పునఃప్రారంభం

చోడవరం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో ప్రధానమైన భీమిలి- నర్సీపట్నం (బీఎన్‌) రహదారి అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. వివిధ కారణాలతో నత్తనడక సాగుతున్న రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. వెంకన్నపాలెం నుంచి సబ్బవరం మండలం లింగాల తిరుగుడు వరకు పునరుద్ధరణ అయిన పనులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. వెంకన్నపాలెం- చోడవరం రోడ్డు పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా నిర్వహిస్తే వచ్చే నెల చివరినాటికి పూర్తయ్యే అవకాశం వుంది.

భీమిలి- నర్సీపట్నం రోడ్డులో చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్‌ నుంచి సబ్బవరం మండలం లింగాలతిరుగుడు గ్రామం వరకు 8.6 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.3.5 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో నరసాపురం నుంచి లింగాలతిరుగుడు వరకు రోడ్డుపై గోతులను మెటల్‌, క్రషర్‌ బుగ్గి మిశ్రమంతో పూడ్చి రోలింగ్‌ చేశారు. ఒక కిలోమీటరు మేర ఒక వైపు తారురోడ్డు వేశారు. తరువాత తారు కొరతతో పనులు ఆగిపోయాయి. మళ్లీ సుమారు నెల రోజుల తరువాత శనివారం తారు రోడ్డు పనులను పునరుద్ధరించారు. లింగాలతిరుగుడు నుంచి అడ్డూరు వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రెండు వైపులా తారురోడ్డు వేస్తున్నారు. మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకపోతే ఈ నెలాఖరునాటికి వెంకన్నపాలెం జంక్షన్‌ వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.

బీఎన్‌ రోడ్డు పనుల్లో జాప్యంపై స్థానిక న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్‌, తదితరులు కోర్టు కేసు వేయగా.. ఆర్‌అండ్‌బీ ఈఈ రంగయ్య గత నెలాఖరున కోర్టుకు హాజరై ఆగస్టు 15వ తేదీలోగా పనులు పూర్తి చేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. కానీ వెంటనే పనులు చేపట్టలేదు. ఎట్టకేటకు ఈ నెల 12వ తేదీన పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌.. వెంకన్నపాలెం నుంచి అంభేరుపురం జంక్షన్‌ వరకు సుమారు అర కిలోమీటరు మేర తారురోడ్డు వేసి ఆపేశారు. ఎనిమిది రోజుల విరామం తరువాత ఆదివారం అంభేరుపురం వద్ద రోడ్డు పనులను పునఃప్రారంభించారు. దీంతో వెంకన్నపాలెం నుంచి చోడవరం వరకు వచ్చే నెలాఖరునాటికి పనులు పూర్తయ్యే అవకాశం వుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా పనులు జరిగితే చోడవరం పట్టణ పరిధిలో మినహా బీఎన్‌ రోడ్డులో సబ్బవరం నుంచి బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వరకు ప్రయాణం సాఫీగా సాగుతుంది.

Updated Date - Aug 24 , 2026 | 12:43 AM