Share News

నోరూరించే బొడ్డెంగులు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:32 PM

గిరిజన ప్రాంత అడవుల్లో లభించే బొడ్డెంగులకు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంది. ప్రస్తుత సీజన్‌లో విరివిగా లభించే బొడ్డెంగులు ఆదివాసీలకు ప్రియమైన ఆహారం.

నోరూరించే బొడ్డెంగులు
యర్రబొమ్మలు గ్రామంలో ఆదివాసీలు సేకరించిన బొడ్డెంగులు

ఆదివాసీలకు ప్రియమైన ఆహారం

అతిథులకు పసందైన విందు

ఈ నెలాఖరు వరకు లభ్యం

మార్కెట్‌లోనూ డిమాండ్‌

చింతపల్లి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత అడవుల్లో లభించే బొడ్డెంగులకు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంది. ప్రస్తుత సీజన్‌లో విరివిగా లభించే బొడ్డెంగులు ఆదివాసీలకు ప్రియమైన ఆహారం. ఏడాదిలో ఒక్కసారైన బొడ్డెంగులను తినాలని గిరిజనులు ఆశపడుతుంటారు. సాధారణంగా ఆదివాసీల ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు విభిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంత ఆదివాసీలు ప్రతీ సీజన్‌లో అడవిలో లభించే దుంపలు, పండ్లు, పండించిన పలు రకాల పంటలను ఆహారంగా తీసుకోవడం సహజం. ఈ సీజన్‌ అడవిలో లభించే బొడ్డెంగులను ఆదివాసీలు సేకరించుకుని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు దీని కూరతో భోజనం పెడితే అది మంచి విందుగా భావిస్తారు.

ఈత మొక్కల మొదల్లో లభించే బొడ్డెంగులను పలు దేశాల ప్రజలు వివిధ పేర్లతో పిలుస్తుంటారు. గిరిజనులు సుదీర్ఘ కాలంగా బొడ్డెంగులుగా సంభోదిస్తున్నారు. బొడ్డెంగులను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశ ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. బొడ్డెంగులను పామ్‌ వార్ము అంటారు. దీని శాస్త్రీయ నామం రైంకోఫోరస్‌ ఫోనిసిస్‌. ఇవి తాటి చెట్లు, ఈత చెట్లలో అధికంగా లభిస్తాయి. గిరిజన ప్రాంతంలో అడవిలో ఏపుగా పెరిగే ఈత మొక్కల మొదలు భాగంలో బొడ్డెంగులు ఉంటాయి. ఈత మొక్కల మొదలు భాగంలో తవ్వి బొడ్డెంగులను సేకరిస్తారు. బొడ్డెంగులు నవంబరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు గిరిజన ప్రాంత అడవుల్లో లభిస్తాయి.

బొడ్డెంగులతో విభిన్న వంటకాలు

ఆదివాసీలు బొడ్డెంగులతో విభిన్న రకాల వంటకాలు చేసుకుని ఆహారంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా బొడ్డెంగుల కూర, ఫ్రై చేసుకుని తినడం ఆనవాయితీగా వస్తున్నది. తాజాగా ఆదివాసీలు విభిన్నంగా కబాబులు, బొడ్డెంగుల ధమ్‌ బిరియాని సైతం చేసుకుని ఆహారంగా తీసుకుంటున్నారు. బొడ్డెంగులను రొయ్యల తరహాలో వండుతున్నారు. కొంత మంది బొడ్డెంగులను స్టార్టర్‌గా తయారు చేసుకుని మద్యంతో ఆరగిస్తున్నారు.

బొడ్డెంగులకు గరిష్ఠ ధర

బొడ్డెంగులకు మార్కెట్‌లోనూ గరిష్ఠ ధర లభిస్తుంది. తొలి రోజుల్లో ఆదివాసీలు అడవి నుంచి సేకరించిన బొడ్డెంగులను ఆహారంగా తీసుకునేందుకు మాత్రమే వినియోగించేవారు. డిమాండ్‌ పెరగడంతో అడవి నుంచి సేకరించి సంతల్లో విక్రయిస్తున్నారు. సంతలో నాలుగు, ఐదు బొడ్డెంగులను రూ.20 ధరకు విక్రయిస్తున్నారు. ఆదివాసీలు సంతలకు తీసుకొచ్చిన బొడ్డెంగులు క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి.

Updated Date - Feb 03 , 2026 | 11:33 PM