నోరూరిస్తున్న బార్బడోస్ చెర్రీ
ABN , Publish Date - Jun 05 , 2026 | 10:12 PM
చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో బార్బడోస్ చెర్రీ మొక్కలు విరగ్గాశాయి. ప్రస్తుతం సీజన్ కావడంతో ఈ పండ్ల దిగుబడులు వచ్చాయి. చిన్నపాటి యాపిల్స్ మాదిరిగా ఉండే ఈ పండ్లు సందర్శకులను నోరూరిస్తున్నాయి.
ఉద్యాన పరిశోధన స్థానంలోవిరగ్గాసిన మొక్కలు
పండ్ల రుచి చూసేందుకు ఎగబడుతున్న ప్రాంతీయులు
గిరిజన ప్రాంతంలో సాగుకు అనుకూలం
చింతపల్లి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో బార్బడోస్ చెర్రీ మొక్కలు విరగ్గాశాయి. ప్రస్తుతం సీజన్ కావడంతో ఈ పండ్ల దిగుబడులు వచ్చాయి. చిన్నపాటి యాపిల్స్ మాదిరిగా ఉండే ఈ పండ్లు సందర్శకులను నోరూరిస్తున్నాయి. ఈ పండ్లు పులుపు, తీపి కలిగిన రుచిలో ఉండడంతో తినేందుకు స్థానికులు, సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. పరిశోధన స్థానంలో పదేళ్లుగా సాగు చేస్తున్నారు. బార్బడోస్ చెర్రీలను వెస్ట్ ఇండియా చెర్రీ, అనిరోలా అని పిలుస్తారు. అరుదుగా లభించే బార్బడోస్ చెర్రీ మొక్కలు గిరిజన ప్రాంతంలో బాగా పెరుగుతున్నాయి. ఈ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బార్బడోస్ చెర్రీలకు ఉత్తర భారతదేశంలోనూ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. విశాఖపట్నంలో మార్కెట్‌లో కిలో రూ.240 ధరకు విక్రయిస్తున్నారు. ప్రాంతీయంగా మార్కెటింగ్ సదుపాయం పెద్దగా లేకపోయినప్పటికీ కుటుంబ సభ్యులు తినడానికి ఆదివాసీలు పెరటిలో రెండు, మూడు మొక్కలు పెంచుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి ఏటా జూన్ నుంచి ఆగస్టు వరకు పండ్ల దిగుబడి అధికంగా వస్తుంది.
సాగుకు గిరిజన ప్రాంతం అనుకూలం
డాక్టర్ వి.రమణ, సీనియర్ శాస్త్రవేత్త,
ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి.
బార్బడోస్ చెర్రీ సాగుకు గిరిజన ప్రాంతం అత్యంత అనుకూలం. పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న బార్బడోస్ చెర్రీ మొక్కలు విరగ్గాస్తున్నాయి. మొక్కలు నాటిన నాలుగో ఏడాది నుంచి కాపుకొస్తాయి. గరిష్ఠంగా 30 సంవత్సరాలు పండ్ల దిగుబడి ఇస్తుంది. బార్బడోస్ చెర్రీ సాగు రైతులు చేపడితే మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. మైదాన ప్రాంతాల సూపర్‌బజార్లకు సైతం ఎగుమతి చేసుకుని అధిక ధర పొందవచ్చు.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
సింగంపల్లి మీనాక్షి, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త,
బీసీటీ-కేవీకే, హరిపురం.
బార్బడోస్ చెర్రీలు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి అధికంగా లభిస్తుంది. పలు రకాల ఖనిజాలు లభిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు కలిగిన వ్యక్తులకు ఆరోగ్యపరంగా మంచి ప్రయోజకరంగా ఉంటుంది. గర్భంలోని శిశువు అభివృద్ధికి ఎంతగానో దోహపడుతుంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. నిద్రలేమి సమస్యను నియంత్రిస్తుంది. ప్రతి మానవుడు ఈ పండ్లను ఏడాదికి ఒకసారి తినడం ఆరోగ్యానికి మంచిది.