ఆదుకున్న కొండవాగులు
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:52 AM
గిరిజన ప్రాంతంలో ఖరీఫ్ సాగుకు రైతులను సహజ జలాలు(కొండ వాగులు) ఆదుకున్నాయి. ఎన్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను రైతులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికి 41 శాతం వర్షపాతం తక్కువ పడింది. చింతపల్లి, జీకే వీధి మండల పరిధిలో సహజ జలాల ఊటగెడ్డలు, చెక్‌డ్యామ్‌లు అందుబాటులో ఉండడం వల్ల రైతులు 70 శాతం వరి నాట్లు వేసుకున్నారు. మరో పది రోజుల్లో శతశాతానికి చేరుకుంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
- ఎన్‌నినో ప్రభావం నుంచి ఆదివాసీ రైతులకు ఉపశమనం
- చింతపల్లి, జీకేవీధి మండలాల్లో 70 శాతం వరి నాట్లు
- మరో పది రోజుల్లో శత శాతం పూర్తి
చింతపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి):
గిరిజన ప్రాంతంలో ఖరీఫ్ సాగుకు రైతులను సహజ జలాలు(కొండ వాగులు) ఆదుకున్నాయి. ఎన్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను రైతులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికి 41 శాతం వర్షపాతం తక్కువ పడింది. చింతపల్లి, జీకే వీధి మండల పరిధిలో సహజ జలాల ఊటగెడ్డలు, చెక్‌డ్యామ్‌లు అందుబాటులో ఉండడం వల్ల రైతులు 70 శాతం వరి నాట్లు వేసుకున్నారు. మరో పది రోజుల్లో శతశాతానికి చేరుకుంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో 28 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. సాధారణంగా జూలై మొదటి పక్షంలోనే గిరిజన రైతులు దాదాపు 80 శాతం వరి నాట్లు పూర్తి చేసుకునేవారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశించిన మేరకు వర్షాలు పడలేదు. గిరిజన ప్రాంతంలో అడపాదడపా వర్షాలు పడడంతో పాటు సహజ జలాలు అందుబాటులో ఉండడంతో గిరిజన రైతులు వరి నాట్లు వేసుకుంటున్నారు.
రైతులను ఆదుకున్న సహజ జలాలు
గిరిజన ప్రాంత రైతులు ప్రకృతిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సహజ జలాలను వినియోగించుకుంటూ రైతులు వరి సాగు చేస్తున్నారు. ఇతర పంటలు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో అడవులు, ఎత్తైన కొండలు అధికంగా ఉండడంతో పలు గ్రామాల్లో ఊటగెడ్డలు, కొండవాగులు అధికంగా ఉన్నాయి. ఈ జలాలను సద్వినియోగం చేసుకుంటూ వరి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఊటగెడ్డలు, కొండవాగులు గతంలో మాదిరిగానే ప్రవహిస్తున్నాయి. గూడెంకొత్తవీధి మండలంలో కొండవాగుల జలాలను నిల్వ చేసేందుకు 58 చెక్‌డ్యామ్‌లు, చెరువులు, అలాగే చింతపల్లి మండలంలో 70 చెక్‌డ్యామ్‌లు, చెరువులు, జలాశయం ఉంది. ఈ చెక్‌డ్యామ్‌ల పరిధిలో ఉన్న పంట పొలాల్లో రైతులు జూలై మొదటి పక్షంలోనే నాట్లు వేసుకున్నారు. నేరుగా కొండవాగులను ఉపయోగించుకుని రైతులు నెలాఖరు నాటికి వరి నాట్లు పూర్తి చేసుకున్నారు. చింతపల్లి మండలంలో 11 వేలు, గూడెంకొత్తవీధిలో 10,500 ఎకరాల్లో రైతులు 70 శాతం వరి నాట్లు వేసుకున్నారు.
స్వల్ప వర్షాలతో ఊరట
ఖరీఫ్ సాగుకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కలిసొచ్చింది. ఈ నెలాఖరిలో అల్పపీడనం ప్రభావం వల్ల మోస్తరు వర్షాలు కురిశాయి. నాలుగు రోజుల్లో చింతపల్లి, జీకేవీధి మండల పరిధిలో 87 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈ వర్షాలను రైతులు సద్వినియోగం చేసుకుంటూ ఆఖరి వరి నాట్లు వేసుకుంటున్నారు. ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో అధికంగా కనిపిస్తున్నప్పటికి గిరిజన ప్రాంతంలో ఈ ఏడాది ఖరీఫ్ నాట్లకు సహజ జలాలు, వర్షాలు అనుకూలించాయని చెప్పాలి. అయితే ఆగస్టు, సెప్టెంబరులో పడే వర్షాలపై దిగుబడులు ఆధాపడి వుంటాయి.