Share News

చదువుల తల్లికి అందలం

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:43 AM

మండలంలోని శిరిజాం పంచాయతీ ఎస్‌ఎన్‌.పురం గ్రామానికి చెందిన మేడపురెడ్డి దేవి ఏపీపీఎస్‌సీ పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మండలంలోని చుక్కపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని (స్కూల్‌ అసిస్టెంట్‌)గా పనిచేస్తున్నారు.

చదువుల తల్లికి అందలం
: మేడపురెడ్డి దేవి

ఏపీపీఎస్‌సీ పోటీ పరీక్షల్లో సత్తాచాటినఉపాధ్యాయిని

డిప్యూటీ డీఈవోగా ఎంపికైన మేడపురెడ్డి దేవి

చీడికాడ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శిరిజాం పంచాయతీ ఎస్‌ఎన్‌.పురం గ్రామానికి చెందిన మేడపురెడ్డి దేవి ఏపీపీఎస్‌సీ పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మండలంలోని చుక్కపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని (స్కూల్‌ అసిస్టెంట్‌)గా పనిచేస్తున్నారు.

చీడికాడ మండలం శిరిజాం పంచాయతీ ఎస్‌ఎన్‌.పురం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన మేడపురెడ్డి దేవి ఒకటో తరగతి నుంచి పీజీ/ బీఈడీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివారు. ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, ప్రాథమికోన్నత విద్య శిరిజాంలో, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు భీమిలిలోని రెసిడెన్షియల్‌ స్కూలో అభ్యసించారు. ఇంటర్మీడియట్‌ విజయనగరం జిల్లా తాటిపూడిలోని గురుకుల కళాశాలలో, టీచర్‌ ట్రైనింగ్‌ భీమునిపట్నం డైట్‌లో, డిగ్రీ చోడవరంలో పూర్తిచేశారు. 2008లో ఎస్‌జీటీగా ఉపాధ్యాయవృత్తిలో చేరారు. తరువాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నుంచి బీఈడీ పూర్తిచేశారు. 2014లో డీఎస్సీ ద్వారా స్కూల్‌ అసిస్టెంట్‌గా ఎంపికై మాడుగుల మండలం కేజీ పురం ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏగా చేరారు. 2020-22లో ఏయూ దూర విద్యా కేంద్రం నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. విద్యా శాఖలో ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకున్న ఆమె 2023లో డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ వెలువడడంతో దరఖాస్తు చేశారు. ప్రిలిమినరీ, మెయిన్స్‌లో సత్తాచాటారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ చూపడంతో డిప్యూటీ డీఈవోగా ఎంపికయ్యారు. దేవి భర్త రాయవరపు గణపతి ప్రస్తుతం చీడికాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. డిప్యూటీ డీఈవోగా ఎంపికైన మేడపురెడ్డి దేవిని జిల్లా విద్యా శాఖ అధికారి అప్పారావునాయుడు బుధవారం అనకాపల్లిలోని తన కార్యాలయంలో సత్కరించారు.

Updated Date - Feb 19 , 2026 | 12:43 AM