పసికందును ఆటోలో వదిలేసిన తల్లి!
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:23 AM
భర్త విడిచిపెట్టేశాడనే మనస్తాపంతో ఐదు నెలల పసికందును ఓ మహిళ మంగళవారం రైల్వే స్టేషన్ వద్ద ఆటోలో వదిలేసింది. ఇందుకు సంబంధించి కంచరపాలెం సీఐ కె.రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కంచరపాలెం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): భర్త విడిచిపెట్టేశాడనే మనస్తాపంతో ఐదు నెలల పసికందును ఓ మహిళ మంగళవారం రైల్వే స్టేషన్ వద్ద ఆటోలో వదిలేసింది. ఇందుకు సంబంధించి కంచరపాలెం సీఐ కె.రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలానికి చెందిన శ్రావణి (22), అర్జున్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉపాధి నిమిత్తం గత ఏడాది విజయవాడ వెళ్లారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అక్కడ పనులు లేకపోవడంతో సోమవారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం బయలుదేరారు. భార్యను వదిలించుకునేందుకు అర్జున్ దువ్వాడ స్టేషన్ వద్ద రైలు దిగిపోయాడు. భర్త కోసం వెతికిన శ్రావణి...అతని ఆచూకీ లభించకపోవడంతో తనను వదిలించుకోవడానికే, ఇలా చేసి ఉంటాడని భావించింది. ఈ నేపథ్యంలో విశాఖలో దిగిన ఆమె...తనతో ఉన్న ఐదు నెలల బిడ్డను రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటోలో వదిలి వెళ్లిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరకు వెళ్లేసరికి శ్రావణి స్పృహతప్పి పడిపోవడంతో అక్కడివారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆమె వద్ద వివరాలు తీసుకుని వేపాడలో గల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈలోగా ఆటోలో పసికందును గుర్తించిన డ్రైవర్లు వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలియజేశారు. బాలుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. స్టేషన్ వద్ద సీసీ పుటేజీల ద్వారా బాలుడి తల్లి శ్రావణిగా గుర్తించి కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం తల్లి,బిడ్డ ఆస్పత్రిలో ఉన్నారు. ఆర్థిక సమస్యలే దంపతుల మధ్య గొడవలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. శ్రావణి భర్త కోసం ఆరా తీస్తున్నారు. కేసును వేపాడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్టు సీఐ రవికుమార్ తెలిపారు.