మరిన్ని వందేభారత్ రైళ్లు అవసరం
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:14 AM
విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు సులభతరమైన ప్రయాణం సాగించేందుకు మరిన్ని వందేభారత్ రైళ్లను మంజూరుచేయాలని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ ఏడాది జూన్/జూలై నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే, విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయాన్ని కేవలం నేవీ అవసరాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేఖ
ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని మూసివేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ప్రస్తావన
విశాఖపట్నం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు సులభతరమైన ప్రయాణం సాగించేందుకు మరిన్ని వందేభారత్ రైళ్లను మంజూరుచేయాలని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ ఏడాది జూన్/జూలై నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే, విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయాన్ని కేవలం నేవీ అవసరాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. అదే జరిగితే విమాన ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడడంతోపాటు సమయం కూడా వృథా అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు రెండు గంటలు సమయం పడుతుందని, అంటే...విమానం ఎక్కేందుకు నాలుగు గంటలు ముందుగా బయలుదేరాల్సి ఉంటుందన్నారు. అంతేగాకుండా విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు టాక్సీలో వెళ్లడానికి రూ.2,500 నుంచి రూ.3 వేలు వరకు వెచ్చించాల్సి ఉంటుందని, విజయవాడ వెళ్లడానికి ప్రస్తుతం విమాన టికెట్ ధర సగటున రూ.3 వేలు ఉందన్నారు. అంటే విమాన టికెట్ కంటే...టాక్సీకే ఎక్కువ ఖర్చవుతుందన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని వందేభారత్ రైళ్లను నడపాలని ఆయన కోరారు. ప్రధానంగా విశాఖపట్నం-విజయవాడ, విశాఖపట్నం-చెన్నై, విశాఖపట్నం- బెంగళూరు, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య తిరిగేలా మరిన్ని వందేభారత్ రైళ్లను మంజూరు చేయాలని కోరారు.