స్ర్తీ శక్తికి మరింత ఆదరణ
ABN , Publish Date - May 22 , 2026 | 12:02 AM
రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి పథకం’ కింద ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఆయాన బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అనకాపల్లి డిపో నుంచి నడిచే బస్సుల్లో 110 శాతం ఓఆర్ నమోదు అవుతున్నది. అయితే పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరిన్ని బస్సులు కేటాయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
తొమ్మిది నెలల్లో 1.7 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం
మహిళలకు రూ.54.46 కోట్లు ఆదా
అనకాపల్లి డిపోలో 110 శాతానికి పెరిగిన ఓఆర్
మరిన్ని బస్సులను ప్రవేశపెట్టాలని ప్రయాణికుల వినతి
అనకాపల్లి టౌన్, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి పథకం’ కింద ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఆయాన బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అనకాపల్లి డిపో నుంచి నడిచే బస్సుల్లో 110 శాతం ఓఆర్ నమోదు అవుతున్నది. అయితే పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరిన్ని బస్సులు కేటాయించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
‘సూపర్ సిక్స్’ హామీల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ‘స్ర్తీ శక్తి’ పథకాన్ని గత ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్టీసీలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపితే ‘జీరో టికెట్’ జారీ చేస్తారు. ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళలు ఎంతో సంతోషిస్తున్నారు. ఉపాధి, ఉద్యోగం, విద్య, వ్యాపార సంబంధ పనులపై రాకపోకలు సాగించే మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతున్నది. వీరిలో రోజూ ప్రయాణించే వారికి నెలకు వెయ్యి రూపాయలకు పైబడి టికెట్ డబ్బులు ఆదా అవుతున్నాయి. ‘స్ర్తీ శక్తి’ పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆయా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఏడాది మే నెల 19వ తేదీ వరకు అనకాపల్లి (90 బస్సులు), నర్సీపట్నం (75 బస్సులు) డిపోల నుంచి ఒక కోటి 60 లక్షల 93 వేల మంది మహిళలు ఆయా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో వీరు 67 శాతం.. అంటే మూడింట రెండొంతుల మంది మహిళలే వున్నారు. ఉచిత ప్రయాణంతో (జీరో టికెట్) వీరికి రూ.54,46,56,000 లబ్ధి చేకూరింది. అనకాపల్లి డిపో నుంచి ఆపరేట్ చేసే బస్సుల్లో కోటి మందికిపైగా మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.32.09 కోట్ల మేర లబ్ధిపొందారు. నర్సీపట్నం డిపో నుంచి ఆపరేట్ చేసే బస్సుల్లో 60.92 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.22.37 కోట్ల మేర డబ్బులు ఆదా చేసుకున్నారు. స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత జిల్లాకు చెందిన పలువురు మహిళలు బృందాలుగా ఏర్పడి అన్నవరం వీరవెంకట సత్యనారాయణమూర్తి, తలుపులమ్మలోవ, సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి, ఉపమాక వేంకటేశ్వరస్వామి, అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వెళుతున్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గతంలో వివిధ పనులపై ఆటోల్లో వెళ్లే వారు... స్ర్తీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నట్టు తెలిసింది. స్ర్తీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టక ముందు ఆర్టీసీ బస్సుల్లో సగటు ఓఆర్ 75 శాతంగా వుండేది. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తరువాత ఓఆర్ 102 శాతానికి పెరిగింది. అనకాపల్లి డిపోలో 110 శాతం, నర్సీపట్నం డిపోలో 94 శాతం నమోదు అవుతున్నది.
మరిన్ని బస్సులు నడపాలి
స్ర్తీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆ ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. బస్సు బయలుదేరే పాయింట్ వద్దనే పూర్తిగా నిండిపోతున్నది. దీంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అత్యధిక బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ కారణంగా డ్రైవర్లు మార్గమధ్యంలో కొన్నిస్టాపుల వద్ద బస్సులు ఆపడంలేదు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.