Share News

ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:12 AM

ప్రతీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్‌) ద్వారా ఫార్మర్స్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్లు(ఎఫ్‌పీవో)లు ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు.

ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు
పాడేరులో రైతుతో మాట్లాడుతున్న డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి తాతారావు

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు

పాడేరురూరల్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రతీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్‌) ద్వారా ఫార్మర్స్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్లు(ఎఫ్‌పీవో)లు ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పాడేరు వచ్చిన ఆయన జిల్లాలోని 11 పీఏసీఎస్‌ల పర్సన్‌ ఇన్‌చార్జులు, సీఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్‌లను లాభాల దిశగా నడిపేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి అన్ని పీఏసీఎస్‌ల పర్సన్‌ ఇన్‌చార్జుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచనల మేరకు జిల్లాలో రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, రైతులు పండించే ప్రతీ పంటకు పీఏసీఎస్‌ల ద్వారా రుణ సదుపాయాలు కల్పించి సేవలు అందించాలన్నదే ముఖ్య ధ్యేయమన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల ఆధారిత రుణాలు, ఎస్‌హెచ్‌జీ రుణాలు, కమర్షియల్‌ రుణాలు, ఎంప్లాయ్‌ ష్యూరిటీ రుణాలు, ఆప్కాబ్‌, నాబార్డు సహకారంతో స్వయం ఉపాధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన కింద ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని ఇళ్లకు సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ఖాళీ స్థలాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొనేందుకు, డ్రిప్‌ ఇరిగేషన్‌, ట్రాక్టర్లు కొనుగోలుకు బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తామన్నారు. డీసీసీబీ, పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు పొందిన రైతులకు ఎన్‌సీడీసీ, ఐటీడీఏ, జీసీసీ ద్వారా సబ్సిడీలు పొందే అవకాశం ఉందని చెప్పారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే డీసీసీబీ ద్వారా అత్యల్ప వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ పర్యటనలో భాగంగా హుకుంపేట పీఏసీఎస్‌ను ఆయన సందర్శించి అక్కడ గిరిజన రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అంతకు ముందు పాడేరు వచ్చిన ఆయనను టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, డీసీసీబీ మాజీ పర్సన్‌ బొర్రా నాగరాజు, పాడేరు పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. పాడేరు డివిజన్‌లో పర్యాటక అభివృద్ధికి రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణాధికారి డీవీఎస్‌ వర్మ, జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, నోడల్‌ ఆఫీసర్‌ రామకృష్ణ, బ్రాంచి మేనేజర్‌ శ్రీనివాసరావు, ఫీల్డ్‌ ఆఫీసర్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:12 AM