Share News

పర్యాటకానికి మరింత ప్రోత్సాహం

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:05 AM

జిల్లాలో పర్యాటకాభివృద్ధికి మరింతగా ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు.

పర్యాటకానికి మరింత ప్రోత్సాహం
పర్యాటక ప్రదేశాల క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ నిషాంతి,. జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

ఘనంగా పర్యాటక దినోత్సవం ప్రారంభం

పాడేరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటకాభివృద్ధికి మరింతగా ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. ఈనెల 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టూరిజం అధికారి పి.చలపతిరావు అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పర్యాటకంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. జిల్లాలోని పర్యాటకానికి డిజిటల్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ జోడిస్తామన్నారు. అందులో భాగంగా ఒక క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పర్యాటకులకు అవసరమైన సమస్త సమాచారం వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయా పర్యాటక ప్రదేశాల్లోనూ వాటి చరిత్ర, ఇతర సమాచారంతో కూడిన క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులో ఉంచుతామని, వాటిని స్కాన్‌ చేస్తే వాటిని సంబంధించిన పూర్తి వివరాలు సందర్శకులకు తెలుస్తాయన్నారు. జిల్లాలో పర్యాటక ప్రదేశాలతోపాటు గిరిజన సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేసేందుకు ‘డిస్కవర్‌ అల్లూరి’ పేరిట డిజిటల్‌ పోర్టల్‌, క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. మన్యంలోని ప్రకృతి అందాలు, స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను ఏఐ వంటి డిజిటల్‌ సాధనాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గిరిజన బాలికలు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ ధింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సాధించిందని ఈసందర్భంగా కలెక్టర్‌ గుర్తు చేశారు. పర్యాటక దినోత్సవాల్లో భాగంగా శనివారం నుంచి వచ్చే 3వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.

టూరిజం వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఐటీడీఏ పీవో

ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా రూపొందించిన జిల్లా టూరిజం వైబ్‌సైట్‌(డిస్కవర్‌ అల్లూరి)ను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా జిల్లాకు సంబంధించిన సమస్త పర్యాటక సమాచారాన్ని తెలుసుకోవచ్చునన్నారు. ఈసందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, జిల్లా టూరిజం అధికారి పి.చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టూరిజం డైరెక్టర్‌ కిల్లు రమేశ్‌నాయుడు, తదితరులు మాట్లాడారు. పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌లను ఆవిష్కరించి, ట్రెక్కింగ్‌ సామాజిక ప్రదర్శనను తిలకించారు. ఈసందర్భంగా గిరిజన బాలికలు సంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో ఎం.భుజంగరావు, డీఈవో భానుమూర్తిరాజు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ రాధామాధవి, జిల్లా గనుల శాఖాధికారి జి.కృష్ణమూర్తి, డీఎంహెచ్‌వో రియాజ్‌భేగ్‌, హౌసింగ్‌ పీడీ బి.బాబు, ఎస్‌ఎంఐ ఈఈ రాజేంధ్రకుమార్‌, తెలుగు మహిళా నేతలు బొర్రా విజయరాణి, లకే పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:05 AM