హైవేపై మరిన్ని సీసీ కెమెరాలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:48 PM
జాతీయ రహదారిపై ప్రధాన జంక్షన్లు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు.
ఇష్టారాజ్యంగా లారీలను నిలపనివ్వకండి
నక్కపల్లి పీఎస్ అధికారులకు ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశం
నక్కపల్లి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):
జాతీయ రహదారిపై ప్రధాన జంక్షన్లు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నక్కపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు స్టేషన్ పరిధిలో అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయాలని, ఒకవేళ ఎక్కడైనా పనిచేయకపోతే వెంటనే మరమ్మతు చేయించాలని చెప్పారు. జాతీయ రహదారి పక్కన ఎక్కడపడితే అక్కడ భారీ వాహనాలు ఆపకుండా చర్యలు చేపట్టాలన్నారు. నక్కపల్లి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, త్వరలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానున్నదని, అందువల్ల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. గంజాయి రవాణా, నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపాలని, పాతనేరస్థులు, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా వుంచాలన్నారు. ఎస్పీ వెంట ఎస్‌ఐలు సన్నిబాబు, మల్లీశ్వరరావు, అంజుమా వున్నారు.