Share News

వాహనదారులపై మరింత భారం

ABN , Publish Date - May 23 , 2026 | 11:22 PM

పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతున్నది.

వాహనదారులపై మరింత భారం
పాడేరులోని ఓ బంకు వద్ద వాహనాల రద్దీ

తాజాగా పెట్రోల్‌పై 95 పైసలు, డీజిల్‌పై 90 పైసలు పెంపు

వారం రోజుల్లో లీటరుపై రూ.5పైగా పెరుగుదల

జిల్లాలో రోజుకు 45 వేల లీటర్ల పెట్రోల్‌,

75 వేల లీటర్ల డీజిల్‌ వినియోగం

నెలకు వాహనదారులపై రూ. కోటి 80 లక్షల ఆర్థిక భారం

పాడేరు, మే 23 (ఆంధ్రజ్యోతి):

పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతున్నది. తాజాగా లీటర్ల పెట్రోల్‌పై 95 పైసలు, డీజిల్‌పై 90 పైసలను చమురు సంస్థలు పెంచాయి. వాస్తవానికి గత వారం రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం క్రితం లీటరు పెట్రోల్‌ రూ.109.37, డీజిల్‌ రూ.97.18 ఉండేవి. దశలవారీగా పెరుగుదల నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రం పాడేరులో లీటరు పెట్రోల్‌ రూ.114.47, డీజిల్‌ రూ.102.21లకు విక్రయిస్తున్నారు. అంటే వారంలో లీటరు పెట్రోల్‌పై రూ.5.10, డీజిల్‌పై రూ.5.03 పెరిగింది. లీటరుపై రూ.5 పెరుగుదల అంటే వాహనదారులపై తీవ్ర ఆర్థిక భారం పడింది.

జిల్లా ప్రజలపై రూ.కోటి 80 లక్షలు భారం

పెట్రో బాదుడు నేపథ్యంలో నెలకు జిల్లాలోని వాహదారులపై రూ.కోటి 80 లక్షలు అదనపు భారం పెడుతుందని ఒక అంచనా. జిల్లాలోని పదకొండు మండలాల్లో 22 బంకులున్నాయి. వాటి ద్వారా రోజుకు 75 వేల లీటర్ల డీజిల్‌, 45 వేల లీటర్ల పెట్రోల్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన నెలకు జిల్లాలోని వాహదారులపై రూ.కోటి 80 లక్షలు ఆర్థిక భారం పడుతుందని అంచనా. అయితే అనుకోని విధిగా వారంలోనే లీటరు పెట్రోల్‌/డీజిల్‌పై రూ.5 పెరగడంతో వాహదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్‌, డీజీల్‌ ధరలు మరింతగా పెరగవచ్చుననే సమాచారంతో రానున్న రోజుల్లో వాహదారులపై మరింత భారం తప్పదనే వాదన బలంగా వినిపిస్తున్నది.

Updated Date - May 23 , 2026 | 11:22 PM