Share News

పంచాయతీలకు కాసుల కటకట

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:03 AM

గ్రామ పంచాయతీలకు మూడు నెలల నుంచి నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో పారిశుధ్యంతోపాటు చిన్నాచితకా అభివద్ధి పనులకు అంతరాయం ఏర్పడింది.

పంచాయతీలకు కాసుల కటకట

మూడు నెలల నుంచి విడుదల కాని నిర్వహణ పనుల నిధులు

మార్చి నుంచి తెరుచుకోని ‘స్వర్ణ పంచాయతీ’ వెబ్‌సైట్‌

బిల్లులు అప్‌లోడ్‌ చేయలేని పరిస్థితి

పారిశుధ్య కార్మికులకు ఆగిన చెల్లింపులు

ఇతర నిర్వహణ పనులకు సైతం ఇక్కట్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీలకు మూడు నెలల నుంచి నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో పారిశుధ్యంతోపాటు చిన్నాచితకా అభివద్ధి పనులకు అంతరాయం ఏర్పడింది. స్వర్ణ పంచాయతీల వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో వివిధ రకాల పనులు, అవసరాలకు సంబంధించి చేసిన ఖర్చుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే అవకాశం లేకపోయింది. దీనివల్ల ప్రభుత్వం నుంచి నిధులు విడదల కాకపోవడంతో పారిశుధ్య కార్మికులకు వేతనాలు సైతం చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

వైసీపీ హయాంలో కేంద్ర విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను పంచాయతీకు ఇవ్వకుండా వేరే అవసరాలకు మళ్లించడంతో కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ కొనడానికి కూడా పంచాయతీ ఖాతాల్లో డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించలేదు. దీంతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్వీర్యం అయ్యాయి. మొత్తం మీద పంచాయతీల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీలను తిరిగి గాడిలో పెట్టడానికి పలు చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మూడు నెలల క్రితం ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ను ప్రారంభించింది. అంతకుముందు గ్రామ పంచాయతీల్లో ప్రతి నెలా కార్యాలయం నిర్వహణ ఖర్చులు, పారిశుధ్యం పనులకు వినియోగించే ట్రాక్టర్ల నిర్వహణ, క్లాప్‌ వాహనాలకు డీజిల్‌, వాటికి మరమ్మతులు, ఇతరత్రా ఖర్చులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే.. మరుసటి నెలలో ప్రభుత్వం నిధులు విడుదల చేసేది. దీంతో కార్యదర్శులు నిధులు డ్రాచేసి చెల్లింపులు జరిపేవారు. అయితే ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వం అన్ని పంచాయతీలను స్వర్ణ పంచాయతీల వెబ్‌సైట్‌ను అనుసంధానం చేసింది. అప్పటి నుంచి వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాడంలేదు. దీంతో మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన ఖర్చుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి వీలు లేకపోయింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందడంలేదు. వాహనాలకు డీజిల్‌ సమస్య ఏర్పడింది. సర్పంచులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏదోలా తాత్కాలికంగా సర్దుబాటు చేసేవారు. కానీ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు తమ సొంత శాఖ పనులతో బిజీగా వుండడంతో ఇన్‌చార్జులుగా వున్న పంచాయతీ గురించి పట్టించుకునే వెసులుబాటు లేకపోయింది.

పారిశుధ్య కార్మికులకు అందని వేతనాలు

జిల్లాలోని పంచాయతీల్లో సుమారు 1,850 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. తుమ్మపాల, చోడవరం వంటి కొన్ని మేజర్‌ పంచాతీల్లో మాత్రమే వేతనాల చెల్లింపులు జరగుతున్నాయి తప్ప మిగిలిన పంచాయతీల్లో వేతనాలు అందక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వేతనాల చెల్లింపు కోసం పంచాయతీ కార్యాలయాల ముందు ఆందోళనలు చేస్తున్నారు.

నిర్వహణ పనులకు నిధులు లేక...

ప్రతి పంచాయతీకి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నిర్వహణ ఖర్చులు అవుతుంటాయి. మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి జిల్లాలోని పంచాయతీలకు సుమారు మూడు కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. బిల్లులు మంజూరైన తరువాత సర్దుబాటు చేసుకోవడానికి కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులు ప్రస్తుతం సొంత సొమ్ము ఖర్చు చేస్తున్నారు. మరోవైపు పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన, పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని, మురుగు కాలువల్లో పూడికలు సరిగా తీయడం లేదంటూ ఎక్కువ మంది సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. మూడు నెలలుగా నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో ఆ ప్రభావం పారిశుధ్య పనులపై పడుతున్నదని కార్యదర్శులు వాపోతున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు వెంటనే చొరవ తీసుకొని ‘స్వర్ణ పంచాయతీ’లకు సంబంధించిన వెబ్‌సైట్‌ పనిచేసేలా చూడాలని, మార్చి నుంచి మే నెల వరకు నిర్వహణ నిధులను ప్రభుత్వం విడుదల చేసేలా చూడాలని కార్యదర్శులు కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2026 | 01:03 AM