మోదీ నోట.. ధింసా మాట
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:48 PM
గిరిజన పల్లెలకే పరిమితమైన ఽఆదివాసీ సంప్రదాయ నృత్యం ధింసా పేరును నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట వినిపించడం విశేషం.
గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ప్రశంసించిన ప్రధాని
నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికిన గిరి బాలికలు
పాడేరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన పల్లెలకే పరిమితమైన ఽఆదివాసీ సంప్రదాయ నృత్యం ధింసా పేరును నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట వినిపించడం విశేషం. ప్రతిష్ఠాత్మకమైన భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి వేలాది మంది గిరిజన బాలికలు ధింసా నృత్య ప్రదర్శన ద్వారా ఘన స్వాగతం పలికారు. అలాగే సభలో మోదీ మాట్లాడుతూ ఆదివాసీ ధింసాతో ప్రపంచ రికార్డు సృష్టించారని, అందుకు కృషి చేసిన అందరికీ, బాలికలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దీంతో ఆదివాసీ సంప్రదాయ నృత్యానికి ప్రధానిచే కితాబు లభించడం, ప్రదర్శించిన గిరిజన బాలికలకు ఒక ప్రత్యేక గుర్తింపు దక్కడంపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఒక్క రోజు ముందు 13 వేల మంది గిరిజన బాలికలు చేసిన ధింసా నృత్య ప్రదర్శన సైతం గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవడం గర్వకారణం.
జిల్లా నుంచి పది వేల మంది తరలింపు
విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి పది వేల మందిని జిల్లా అధికారులు తరలించారు. 7 వేల మంది గిరిజన విద్యార్థినులను 140 బస్సుల్లో మూడు రోజుల ముందే విజయనగరం తరలించారు. వాళ్లు అక్కడ ధింసా ప్రదర్శనల రిహార్సల్స్ చేసి, శుక్ర, శనివారాలు ప్రదర్శనలిచ్చారు. అలాగే శుక్రవారం సాయంత్రం మరో 46 బస్సుల్లో సాధారణ జనం తరలివెళ్లారు. జిల్లా అధికారులు విద్యార్థినులు, ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించారు.
ధింసాతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు
ప్రతిష్ఠాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన విద్యార్థినులు చేసిన ధింసా ప్రదర్శన గిన్నిస్ రికార్డులో నమోదు కావడంతో జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించిందని కలెక్టర్ టి.నిషాంతి శనివారం ఒక ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల సమన్వయం, గిరిజన బాలికల ప్రతిభ కలగలిపి ధింసా ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించారన్నారు. దేశ చరిత్రలో నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో గిరిజన బాలికల ధింసా నృత్యం గిన్నిస్ రికార్డు సాఽధించడంతో పాటు దేశ ప్రధానికి ధింసాతో స్వాగతం పలకడం చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యానికి, ప్రదర్శించిన గిరిజన బాలికలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థినులు మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకు కృషి చేసిన జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే పరిమిళ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బాలికలకు కలెక్టర్ నిషాంతి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.