దేశాభివృద్ధిలో మోదీ పాత్రే కీలకం
ABN , Publish Date - Jun 16 , 2026 | 10:43 PM
దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకమని అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేశ్ అన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.
12 ఏళ్లలో అన్ని రంగాల్లో ప్రగతి బాట
అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్
అనకాపల్లి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకమని అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేశ్ అన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. మంగళవారం అనకాపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు, అనంతరం దేశంలో జరిగిన అనేక మార్పులను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. దేశంలో 160 కొత్త విమానాశ్రయాలు నిర్మించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఆహారభద్రత కల్పిస్తున్నామన్నారు. 60 లక్షల మందికి ఆయుష్మాన్‌భవ కింద వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. రైల్వే రంగాన్ని 12 ఏళ్లలో దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కృషి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో కనీసం రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్‌షిప్ విధానంలో సైనిక్ స్కూల్స్ అభివృద్ధికి ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
మంత్రి అనితపై వ్యాఖ్యలు సరికాదు
హోం మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సరికావని ఎంపీ సీఎం రమేశ్ ఖండించారు. రాజకీయాల్లో నాయకులు హుందాగా వ్యవహరించాలన్నారు. ఉన్నత పదవిలో ఉన్న ఒక దళిత మహిళపై సభ్యసమాజం తలదించుకొనేలా మేకప్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, బీజేపీ నాయకులు ఈర్లే శ్రీరామ్మూర్తి తదితరులున్నారు.