రూ.660 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:17 AM
విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు రూ.660 కోట్లతో జరుగుతున్నాయని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు.
అదనంగా ప్లాట్‌ఫారాలు, లైన్లు
2028 డిసెంబరు నాటికి పనులు పూర్తి
ఎంపీ ఎం.శ్రీభరత్
విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు రూ.660 కోట్లతో జరుగుతున్నాయని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. కూటమి నాయకులతో కలిసి ఆయన గురువారం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పనులన్నీ పూర్తయితే స్టేషన్ దేశంలోనే అత్యున్నతమైనదిగా నిలుస్తుందన్నారు. రూ.480 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం కాగా ప్రయాణికుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డు ఆ మొత్తాన్ని రూ.660 కోట్లకు పెంచిందన్నారు. అదనపు రైల్వే లైన్లు, ప్లాట్‌ఫారాలు వస్తాయని అప్పుడు రైళ్లన్నీ దాదాపు 96 శాతం నిర్దేశించిన సమయానికే స్టేషన్‌కు చేరుకుంటాయన్నారు. నగర శివార్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. వాహనాలకు విశాలమైన పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. మొదటి దశ పనులు 2027 డిసెంబరు నాటికి, మొత్తం ప్రాజెక్టు 2028 డిసెంబరుకు పూర్తవుతుందన్నారు. స్టేషన్ ప్రాంగణంలో వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేయాలని సూచించామన్నారు. ఈ బృందానికి రైల్వే చీఫ్ ఇంజనీర్ (కనస్ట్రక్షన్) విష్ణుమూర్తి అభివృద్ధి పనులన్నీ వివరించగా డీఆర్‌యూసీసీ సభ్యులు చలసాని గాంధీ, కూటమి నాయకులు సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు.