Share News

గురుకులంలో అధునాతన బోధన

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:07 AM

గురుకుల కళాశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కంప్యూటర్‌ విద్య సత్ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు వృత్తి విద్య కోర్సుతో పాటు కంప్యూటర్‌ విద్యపై పట్టు సాధిస్తున్నారు.

గురుకులంలో అధునాతన బోధన
టీడబ్ల్యూ గురుకుల కళాశాలలో కంప్యూటర్‌ ప్రాక్టికల్స్‌ చేస్తున్న ఇంటర్‌ విద్యార్థులు (ఫైల్‌)

ఇంటర్‌ విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ

సీఏ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌ కోచింగ్‌

విద్యా రంగంలో సంస్కరణల్లో భాగంగా ప్రయోగాత్మకంగా చింతపల్లి టీడబ్ల్యూ గురుకుల కళాశాలలో అమలు

చింతపల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గురుకుల కళాశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కంప్యూటర్‌ విద్య సత్ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు వృత్తి విద్య కోర్సుతో పాటు కంప్యూటర్‌ విద్యపై పట్టు సాధిస్తున్నారు. గత ఏడాది నుంచి అన్ని గ్రూపుల విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యాబోధన జరుగుతోంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా చార్టెడ్‌ అకౌంటెంట్‌లో ప్రవేశం పొందేందుకు శిక్షణ పొందుతున్నారు.

కూటమి ప్రభుత్వం విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. వృత్తి విద్యా కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గురుకులం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఇంటర్‌ విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గురుకులం అధికారులు 2024లో జిల్లాలో తొలివిడతగా చింతపల్లి టీడబ్ల్యూ గురుకుల కళాశాలలో కంప్యూటర్‌ విద్యా బోధనను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సు అకౌంట్స్‌ అండ్‌ ట్యాక్స్‌(ఏఎన్‌టీ) గ్రూపులు ఉన్నాయి. ఏఎన్‌టీ కోర్సులో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 20 సీట్లు చొప్పున ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో ఈ కోర్సుకి ప్రత్యేక డిమాండ్‌ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకుని మరో ఏడాదిపాటు కంప్యూటర్‌ విద్యను నేర్చుకోవాల్సి వస్తున్నది. ఈ కారణంగా ఏఎన్‌టీ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లేందుకు ఒక ఏడాది సమయం వృఽథా అవుతున్నది. ఈ నేపథ్యంలో గురుకులం కార్యదర్శి గౌతమి ప్రత్యేక చొరవతో ఇంటర్మీడియట్‌తో పాటు బేసిక్‌ కంప్యూటర్‌ కోర్సులో శిక్షణ ప్రారంభించారు.

కళాశాలలో ప్రత్యేక ల్యాబ్‌

గురుకుల కళాశాలలో ప్రత్యేక కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌లో శిక్షణకు అవసరమైన 15 న్యూజెనరేషన్‌ డెస్క్‌ టాప్‌ కంప్యూటర్లు ఉన్నాయి. ఒకేసారి పదిహేను మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ల్యాబ్‌ వద్ద థియరీ బోధన కోసం డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ ఉంది. కళాశాలలో ఏఎన్‌టీ కోర్సులో విద్యార్థులకు బేసిక్‌ కోర్సులను బోధిస్తున్నారు. ప్రధానంగా డీటీపీ, ఎంఎస్‌ ఆఫీస్‌, ఫొటోషాప్‌, ట్యాలీ ఈఆర్‌పీ-9 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు కంప్యూటర్‌ అధ్యాపకులు సీతారాం, సుబ్బారావు ఉన్నారు. ప్రతి రోజు రెండు పిరియడ్లను కంప్యూటర్‌ శిక్షణకు కేటాయించారు. దీంతో విద్యార్థులు కంప్యూటర్‌ కోర్సులను ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.

సీఏ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌ కోచింగ్‌

గురుకుల కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ ద్వారా చార్టెడ్‌ అకౌంటెంట్‌లో ప్రవేశం పొందేందుకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు సీఏ కోచింగ్‌ ఇచ్చేందుకు మాస్టర్‌మైండ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కళాశాలలో ఎనిమిది డిజిటల్‌ తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ తరగతి గదుల్లో విద్యార్థులు ప్రతి రోజు మూడు నుంచి ఐదు గంటల వరకు సీఏ ప్రవేశ పరీక్షకు శిక్షణ పొందుతున్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:07 AM