సేవలపై మోస్తరు సంతృప్తి
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:01 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కార్యాలయాల ద్వారా అందిస్తున్న సేవలపై జిల్లా ప్రజల్లో మోస్తరు సంతృప్తి వ్యక్తం అవుతున్నది.
సంక్షేమ పథకాలు, శాఖల పనితీరుపై పలువురి నుంచి సమాచారాన్ని సేకరించిన ప్రభుత్వం
ప్రజలు వెల్లడించిన అభిప్రాయాల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు
66.9 శాతం ప్రజల సంతప్తితో రాష్ట్రస్థాయిలో 17వ స్థానం
వ్యవసాయ శాఖ సేవల్లో టాప్
మెరుగ్గా ఆర్టీసీ, కాలుష్య నియంత్రణ, అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలు
పలు రంగాల్లో కింద నుంచి ఐదు స్థానాల్లో..
అధ్వానంగా వైద్య ఆరోగ్య, విద్యుత్, రెవెన్యూ శాఖల సేవలు
అనకాపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కార్యాలయాల ద్వారా అందిస్తున్న సేవలపై జిల్లా ప్రజల్లో మోస్తరు సంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఈ విషయంలో అనకాపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో 17వ స్థానంలో నిలిచింది. వివిధ పథకాలు, శాఖల పనితీరుపై ప్రభుత్వం వివిధ వర్గాలు, లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా జిల్లాల వారీగా మార్కులు, వాటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం అమరావతి నుంచి వర్చువల్‌గా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ముందు నిలిచిన జిల్లాల అధికారులు అభినందించి, వారిని ఆదర్శంగా తీసుకొని, మిగిలిన జిల్లాల అధికారులు కూడా ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా సేవలు అందించాలని సూచించారు. మొత్తం 26 జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి, సంతృప్తి, అసంతృప్తి శాతాల ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. వ్యవసాయం, స్ర్తీ శిశుసంక్షేమం, ఆర్టీసీ, కాలుష్య నియంత్రణ వంటి వాటిలో అనకాపల్లి జిల్లా చాలా మెరుగ్గా వుంది.
అనకాపల్లి జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు, సేవలు, అభివృద్ధికి సంబంధించి ప్రజల సంతృప్తి 66.9 శాతం వుండగా, అసంతృప్తి 33.1 శాతం వుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు విత్తనాల సరఫరా, ప్రభుత్వం ప్రకటించన ధరకే విత్తనాల పంపిణీ విషయాల్లో 74.9 శాతంతో అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులపట్ల డ్రైర్లు, కండక్టర్ల ప్రవర్తన, బస్సు ప్రయాణంలో భద్రత అంశాల్లో 75.8 శాతం సానుకూలతతో అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో వుంది. ఆర్టీసీ బస్‌స్టేషన్లలో పరిశుభ్రత, ప్రయాణికులు వేచివుండే ప్రదేశం, కూర్చోడానికి బెంచీలు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల అంశాల్లో 62.2 శాతం సానుకూలతతో జిల్లా రెండో స్థానంలో వుంది.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అవినీతి, సేవలపై సంతృప్తి విషయాల్లో 75 శాతంతో జిల్లా రెండో స్థానంలో వుంది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు పాలు, కోడిగుడ్లు, బాలామృతం నాణ్యత, సకాలంలో పంపిణీ విషయాల్లో 83.2 శాతంతో జిల్లా మూడోస్థానంలో వుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం పంపిణీ, నాణ్యత, రక్షిత తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణలో 83.7 శాతంతో జిల్లా రెండోస్థానంలో వుంది. పట్టణ ప్రాంతాల్లో వీధి దీపాల నిర్వహణలో 75.4 శాతంతో జిల్లా మూడో స్థానంలో వుంది.
ఈ రంగాల్లో అధ్వానం
రాష్ట్ర స్థాయి రేటింగ్స్‌లో కొన్ని అంశాల్లో జిల్లా దిగువ నుంచి ఐదు స్థానాలకే పరిమితమైంది. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో వుండడం, ఉచిత మందుల పంపిణీ, ఆస్పత్రుల్లో అవినీతి, పరిశుభ్రత అధ్వానంగా వున్నట్టు ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆయా అంశాలపై 62.3 శాతంతో అట్టడుగుస్థాయి నుంచి రెండో స్థానంలో వుంది.
అన్న క్యాంటీన్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిర్ణీత వేళలకు తెరవడం వంటి విషయాల్లో 79.6 శాతంతో చివరి నుంచి నాలుగో స్థానంలో వుంది.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఓల్టేజీ సమస్య, సిబ్బంది అందుబాటులో వుండడంపై 63.6 శాతంతో రాష్ట్రస్థాయిలో చివరి నుంచి మూడో స్థానంలో వుంది.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సమస్య, పోలీసుల స్పందన, బహిరంగంగా అమ్మకాలు, సేవించడం వంటి వాటి కట్టడి విషయంలో 69.2 శాతంతో జిల్లా చివరి నుంచి మూడో స్థానంలో వుంది.
రెవెన్యూ సేవల (ఆర్‌వోఆర్) విషయంలో అదనంగా డబ్బులు వసూళ్లు, నోటీసులు జారీ చేయడం, క్షేత్రస్థాయిలో విచారణ, ఆర్డర్ కాపీల జారీ, వీఆర్వోల సంతకాల విషయాల్లో 46.9 శాతంతో అనకాపల్లి జిల్లా అట్టడుగు నుంచి నాలుగో స్థానంలో వుంది.
ఇసుక సరఫరా, ప్రజలకు ఇసుక అందుబాటులో వుండడం, నిర్మాణాలకు ఉపయోకరగంగా వుండడంపై 56.9 శాతంతో చివరి నుంచి మూడో స్థానంలో వుంది.
జిల్లా ఆస్పత్రిలో ఓపీడీకి వైద్యులు అందుబాటులో వుండడం, ఉచిత మందుల పంపిణీ, ఆస్పత్రుల్లో పరిశుభ్రత, వైద్య సిబ్బంది అవినీతి విషయాల్లో 67 శాతంతో చివరి నుంచి ఐదో స్థానంలో వుంది.
బీసీ సంక్షేమ శాఖ విద్యాలయాలు, వసతిగృహాల్లో మెనూ అమలు, వార్డెన్ల పనితీరు, తాగునీరు, పారిశుధ్యం విషయాల్లో 64.4 శాతంతో జిల్లా దిగువ నుంచి ఐదో స్థానంలో వుంది.