Share News

కుండపోత

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:29 AM

తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం నగరం, పరిసర ప్రాంతాల్లో ముసురు వాతావరణం కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దఫదఫాలుగా ఒక మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం నుంచి భారీవర్షం కురిసింది. తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో అంటే...రాత్రి తొమ్మిది గంటల నుంచి కుండపోతగా కురుస్తూనే ఉంది. ఆ సమయంలో గాలులు కూడా వీయడంతో అక్కడక్కడా చెట్లు కూలిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు నగరం, జిల్లాలో పలు రహదారులు దెబ్బతిన్నాయి.

కుండపోత

ఉదయం నుంచి దఫదఫాలుగా ఒక మోస్తరు వర్షం

రాత్రి తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో

నగరాన్ని తాకిన దట్టమైన మేఘాలు

దాంతో అతిభారీవర్షం

కాపులుప్పాడలో 55 మి.మీ. నమోదు

కస్తూరినగర్‌లో జారిన కొండ చరియలు

పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

గాలులకు నేలకొరిగిన చెట్లు

విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం నగరం, పరిసర ప్రాంతాల్లో ముసురు వాతావరణం కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దఫదఫాలుగా ఒక మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం నుంచి భారీవర్షం కురిసింది. తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో అంటే...రాత్రి తొమ్మిది గంటల నుంచి కుండపోతగా కురుస్తూనే ఉంది. ఆ సమయంలో గాలులు కూడా వీయడంతో అక్కడక్కడా చెట్లు కూలిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు నగరం, జిల్లాలో పలు రహదారులు దెబ్బతిన్నాయి.

వర్షానికి లాసన్స్‌బే కాలనీలో బుధవారం ఉదయం భారీ వృక్షం నేలకొరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అక్కడకు చేరుకుని జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం, పోలీస్‌, విద్యుత్‌ శాఖ సిబ్బందిని సమన్వయం చేసుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే ఉత్తర నియోజకవర్గ పరిధిలో గల సత్యం కూడలి నుంచి రామాటాకీస్‌కు వెళ్లే మార్గంలో బుల్లయ్య కళాశాల వద్ద డివైడర్‌పై ఉన్న ఒక చెట్టు కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజారోగ్య విభాగం చేరుకొని చెట్టు కొమ్మలను తొలగించారు. చెట్టుపడిన సమయంలో జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా వర్షాలకు ముడసర్లోవ రిజర్వాయర్‌లో మూడు అడుగుల మేర వరద నీరు చేరింది. రిజర్వాయర్‌ గరిష్ఠ పరిమితి 169 అడుగులు కాగా, ప్రస్తుతం 154.4 అడుగులకు చేరింది.

దట్టమైన మేఘాల రాక

తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో దానికి సంబంధించిన బాహ్య బంధాలు (అవుటర్‌ బాండ్‌) బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయాన విశాఖ పరిసరాలను తాకాయి. దట్టమైన మేఘాల రాకతో నగరంలో తొమ్మిది గంటల తరువాత ఒక్కసారిగా వర్షం జోరందుకుంది. రాత్రి పది గంటలు తరువాత వర్షం తీవ్రత పెరుగుతుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అర్ధరాత్రి సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు కాపులుప్పాడలో 55 మిల్లీమీటర్లు, తులసీ నగర్‌ పార్కులో 51.77, మహారాణిపేటలో 47.5, చంద్రంపాలెం జడ్పీస్కూల్‌ వద్ద 44.5, సీతమ్మధారలో 44, గంభీరంలో 37.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. కలెక్టరేట్‌, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, ఆర్డీవో, తహశీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి నిరంతరం సమీక్షిస్తున్నారు. కాగా తీవ్ర వాయుగుండం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేట నిలిపివేశారు.

నేడు కూడా విద్యా సంస్థలకు సెలవు

విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

వర్షాలు తగ్గకపోవడంతో జూనియర్‌ కళాశాలలు, పాఠశాలలకు గురువారం కూడా సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ఉత్తర్వులు జారీచేశారని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు కూడా తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గురువారానికి బదులుగా మరో రోజు పాఠశాల నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించామని ఆర్‌ఐవో మురళీధర్‌ తెలిపారు.

Updated Date - Sep 24 , 2026 | 01:29 AM