మన్యంలో మోస్తరు వర్షం
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:00 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ఏజెన్సీలో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి.
పొలాల్లోకి చేరిన వర్షపు నీరు
ముంచంగిపుట్టును వీడని వాన
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు
పాడేరు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ఏజెన్సీలో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడుతుండగా, పలు మండలాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. తాజా వాతావరణంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
సీలేరులో..
జీకేవీధి మండలం సీలేరు, ధారకొండ, దుప్పులవాడ, గుమ్మిరేవుల పంచాయతీల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా భారీగా వర్షం కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వర్షం పంటలకు ఊపిరిపోసిందని వారంటున్నారు.
ముంచంగిపుట్టులో..
మండలాన్ని కొద్ది రోజులుగా వర్షం వీడడం లేదు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దఫదఫాలుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు, గెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని కుజభంగి జంక్షన్ నుంచి బంగారుమెట్ట మీదుగా రూడకోట వెళ్లే ప్రధాన రహదారి పలు చోట్ల దెబ్బతింది. రహదారి పొడుగునా ఎక్కడ పడితే అక్కడ గోతులు ఏర్పడడంతో వర్షపు నీరు నిల్వ ఉండిపోయింది. మండల కేంద్రం నుంచి కుమడ వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు దెబ్బతింది. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.