Share News

నేడే మోదమ్మ ఉత్సవాలు ఆరంభం

ABN , Publish Date - May 16 , 2026 | 10:50 PM

మన్యం వాసుల ఆరాధ్య దేవతమోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి పాడేరులో ఘనంగా ప్రారంభం కానున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలిచే మోదకొండమ్మ ఉత్సవాలు మూడు రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మోదకొండమ్మను దర్శించుకునేందుకు మారుమూల గిరిజన గూడెల్లో నివసించే వారితోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాలకు సంబంధించినఏర్పాట్లన్నీ ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

నేడే మోదమ్మ ఉత్సవాలు ఆరంభం
పాడేరు మోదకొండమ్మ అమ్మవారు

మూడు రోజుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

పాడేరు పట్టణానికి పండుగ శోభ

శతకంపట్టులో అమ్మవారి ప్రతిష్ఠతో ఉత్సవాలకు శ్రీకారం

వైభవంగా మోదకొండమ్మ ఉత్సవాలు: గిడ్డి ఈశ్వరి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మోదకొండమ్మ అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చే తంతుతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్థానిక ఆలయం (అత్తవారిల్లు)లోని కొలువు తీరే ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను ఆదివారం ఉదయం భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి అమ్మవారి పుట్టిల్ల్లుగా భావించే స్థానికంగా ఏర్పాటు చేసిన శతకంపట్టు పందిరిలో ప్రతిష్ఠిస్తారు. శతకంపట్టులో మోదకొండమ్మ కొలువుదీరడంతోనే మూడు రోజుల ఉత్సవాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈసందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఘటాలతో ఊరేగింపు కనుల పండువగా సాగుతుంది. రెండు రోజులు(సోమ, మంగళవారాలు) అక్కడే ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. అలాగే శతకంపట్టులో కొలువుతీరిన అమ్మవారిని మూడో రోజు తిరిగి ఆలయంలో చేర్చడం (అనుపోత్సవం)తో ఉత్సవాలు ముగుస్తాయి. ఆఖరి రోజు నిర్వహించే అనుపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఊరేగింపు పట్టణ వీధుల్లో జరుగుతుంది. మూడు రోజుల పాటు పలు సంస్కృతి కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఉత్సవాల్లో ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు

మూడు రోజులు జరిగే ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యక్రమాలు, పథకాలపై ప్రజల్లో అవగాహనకు అధికారులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఏజెన్సీలో ఐటీడీఏ చేసిన అభివృద్ధిపై సమాచార శాఖ ఆధ్వర్యంలో ఫొటో ప్రదర్శన, జీసీసీ, వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ, ఐసీడీఎస్‌, వెలుగు, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ శాఖలు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఉత్సవాలకు వచ్చే చిన్నాపెద్దా ఉత్సాహంగా, ఆనందంగా గడిపేందుకు సంప్రదాయ, వినోద కార్యక్రమాలకు నిర్వాహకులు పెద్దపీట వేస్తారు. ఉత్సవాల్లో వివిధ రకాల వస్తువుల విక్రయాలతోపాటు పిల్లలు ఆడుకునేందుకు రంగుల రాట్నాలు, పెద్దపెద్ద జెయింట్‌ వీల్స్‌, డిస్కోడాన్స్‌, డ్రాగన్‌ ట్రైన్‌, చిన్నచిన్న మోటార్‌ సైకిళ్లు, కార్లు, ట్రాయ్‌ట్రైన్‌లు, సర్కస్‌లు, డైనోసార్‌ ఉయ్యాల వంటివి ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కుటుంబాలతో వచ్చే వారికి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మూడు రోజులపాటు సినీ, టీవీ కళాకారులతో పలు ప్రదర్శనలు, ఆర్కెస్ట్రాలు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేస్తారు.

వైభవంగా మోదకొండమ్మ ఉత్సవాలు

ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి

మోదకొండమ్మ ఉత్సవాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్‌ నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ల సహకారంతో ఉత్సవాల స్థాయిని రెట్టింపు చేసేలా ఏర్పాట్లు చేశాం. పట్టణమంతా కోల్‌కతాకు చెందిన వారితో విద్యుత్‌ దీపాలంకరణతో ముస్తాబు చేయించాం. అధికారులతో సమన్వయంగా వ్యవహరిస్తూ ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. మూడు రోజులు అన్ని స్టేజీలపై సినీ, టీవీ కళాకారులతో భారీ వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. గతంలో కంటే ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నాం.

Updated Date - May 16 , 2026 | 10:50 PM