అంగరంగ వైభవంగా మోదకొండమ్మ జాతర
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:02 AM
మాడుగుల మోదకొండమ్మ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది.
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
సతకంపట్టు నుంచి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలతో ఆలయానికి ఊరేగింపు
మాడుగుల, జూన్ 2 (ఆంధ్రజ్యోతి):
మాడుగుల మోదకొండమ్మ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారిని ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం అయ్యాయి. స్థానికులతోపాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాడుగుల పట్టణ మహిళలు ఘటాలను శిరస్సుపై ఉంచుకొని ఆలయానికి వచ్చారు. క్యూ లైన్లలో నిల్చుని, అమ్మువారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. వేసవి తీవ్రతా కారణంగా భక్తులు ఉదయమే ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు భక్తుల తాకిడి అధికంగా వుంది. రాత్రి వరకు దర్శనాలు కొనసాగాయి. కాగా నెల రోజుల క్రితం సతకంపట్టు వద్ద కొలువు తీర్చిన అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను సాయంత్రం ఆరున్నర గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి చేర్చారు. జాతర సందర్భంగా మోదకొండమ్మను మాడుగుల కోట మహారాణి మయాంక్ కుమారిదేవి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తదితరులు దర్శించుకొని పూజలు చేశారు.