ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మోదకొండమ్మ
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:07 AM
పాడేరు మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీరుకు నిరసనగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడుతోపాటు మరికొంతమంది కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆలయ కమిటీ ప్రతినిధులు రాజీనామా
తన భార్యకు ఎంపీపీ భీపారం ఇచ్చి వేరొకరిని రంగంలోకి
దించారని కోటిబాబునాయుడు ఆరోపణ
ఎమ్మెల్యే వివరణ ఇవ్వకుంటే ఎంపీటీసీ పదవికి
తన భార్య రాజీనామా చేస్తారని ప్రకటన
పాడేరురూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
పాడేరు మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీరుకు నిరసనగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడుతోపాటు మరికొంతమంది కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కోటిబాబునాయుడు, కమిటీ ప్రతినిధులు బోనంగి వెంకటరమణ, కిల్లు చంద్రమోహన్ కుమార్ నాయుడు, గూడెపు సూర్యప్రకాష్, దన్నేటిపలాసి రాము విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో పాడేరు-1 సెగ్మెంట్ నుంచి గెలుపొందిన కోటిబాబునాయుడు భార్య కిల్లు శాంతకుమారిని ఎంపీపీగా చేసేందుకు బీఫారం ఇచ్చారన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో 19వ తేదీ నిర్వహించిన ఎంపీపీ ఎంపిక సమయంలో వైసీపీకి చెందిన కాడెలి ఎంపీటీసీ సభ్యులు వంజంగి అంబ్రిష రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పరోక్షంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కారణమని వారు ఆరోపించారు. ఇందుకు నిరసనగా తామంతా మోదకొండమ్మ ఆలయ కమిటీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా కోటిబాబు నాయుడు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల వ్యవహారం వైసీపీలో వివాదానికి దారితీసిందన్నారు. పార్టీ బీఫారం ఇచ్చినప్పటికీ తన భార్య శాంతకుమారికి ఎంపీపీ పదవి దక్కకపోవడానికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఒక టీడీపీ నాయకుడుతో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే వైసీపీ రెబల్ అభ్యర్థి అంబ్రిష ఎంపీపీగా ఎంపికయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వకపోతే తన భార్య శాంతకుమారి ఎంపీటీసీ పదవికి కూడా రాజీనామా చేస్తారని కోటిబాబునాయుడు ప్రకటించారు.