Share News

ప్రధాని సభకు జన సమీకరణ

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:20 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించనున్న సభకు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి 91 వేల మందిని సమీకరిస్తున్నారు.

ప్రధాని సభకు జన సమీకరణ

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి 91,000 మంది

2,020 బస్సులు ఏర్పాటు

తిరుగు ప్రయాణంలో భోజనాలు

ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కచోట ఏర్పాటు

ఇన్‌చార్జులుగా జీవీఎంసీ అధికారులు, జోనల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు నియామకం

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించనున్న సభకు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి 91 వేల మందిని సమీకరిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాలను తరలించడానికి 2,020 బస్సులు ఏర్పాటుచేస్తున్నారు. శనివారం ఉదయం ప్రధాని సభకు హాజరై తిరిగి వచ్చే సమయంలో అందరికీ విశాఖ శివారున భోజనాలు అందించనున్నారు. శనివారం ఉదయం నియోజకవర్గాల్లో బస్సులు బయలుదేరే పాయింట్‌లో వాటర్‌ బాటిల్స్‌, అరటిపండు, టమాటా బాత్‌తో కూడిన ప్యాకెట్‌ అందిస్తారు. ఈ ప్యాకెట్లు ఆయా జిల్లాల యంత్రాంగాలు అందించనున్నాయి. ఇక ప్రధాని సభ ముగిసిన తరువాత వారంతా ఇళ్లకు చేరుకోవడం ఆలస్యం కానున్నందున భోజనాలు అందించే బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు అప్పగించారు. అయితే 91 వేల మందికి ఒకేచోట కాకుండా నియోజకవర్గాల వారీగా భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన పది వేల మందికి పోలిపల్లి సమీపాన భూమాత లేఅవుట్‌లో, భీమిలికి చెందిన పది వేల మందికి పేరం లేఅవుట్‌లో, భీమిలికి చెందిన మరో పది వేల మందికి తగరపువలస ఓక్రిడ్జ్‌ స్కూలు వద్ద, నార్త్‌ నియోజకవర్గానికి చెందిన రెండు వేల మందికి అవంతి కళాశాల సమీపాన, ‘సౌత్‌’ నియోజకవర్గానికి చెందిన రెండు వేల మందికి ఆనందపురం కింగ్స్‌ డాబా వద్ద, మరో ఎనిమిది వేల మందికి ఉత్కృష్ఠ లేఅవుట్‌లో భోజనాలు అందిస్తారు. గాజువాకకు చెందిన రెండు వేల మందికి ఆనందపురం సమీపానున్న చెన్నా కన్వెన్షన్‌ సెంటర్‌లో, మరో రెండు వేల మందికి వెల్లంకి హార్బర్‌ స్కూలు, పశ్చిమకు చెందిన 8,500 మందికి గంభీరం పైడా కళాశాల వద్ద, పెందుర్తి నుంచి వచ్చే పదివేల మందికి శొంఠ్యాం ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్‌లో, అనకాపల్లికి చెందిన పది వేల మందికి ఆల్‌అమీర్‌ కళాశాల, గుడిలోవ ఆర్‌ఎస్‌ఎస్‌ స్కూల్‌ వద్ద, అగనంపూడి ప్రాంతం నుంచి వచ్చే 1,000 మందికి ఆనందపురం ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు వద్ద భోజనాలు అందిస్తారు. కాగా అదనంగా మరో ఇరవై వేల మంది కోసం సంగివలస అనిట్స్‌ కళాశాల వద్ద సిద్ధం సభ ప్రాంగణం, తర్లువాడల్లో భోజనాలు అందించేందుకు ఏర్పాట్లుచేశారు. ప్రతిచోట జిల్లా, జీవీఎంసీ అధికారులు, జోనల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, ఇతర అధికారులను ఇన్‌చార్జులుగా నియమించారు. ప్రతిచోట టెంట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.


నేడు ప్రముఖుల రాక

నగరానికి గవర్నర్‌, ముఖ్యమంత్రి,

ఉప ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి...

ముగ్గురు ఇక్కడే బస

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్‌లు శుక్రవారం నగరానికి వస్తున్నారు. గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి నగరానికి చేరుకుని నోవాటెల్‌ హోటల్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం రోడ్డుమార్గంలో భోగాపురం వెళ్లి ప్రధానితోపాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానికి వీడ్కోలు పలికి తిరిగి విశాఖ చేరుకుని ఇక్కడ నుంచి విజయవాడ వెళతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్‌లో నగరానికి చేరుకుంటారు. పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. శనివారం కోస్టల్‌ బ్యాటరీ వద్ద నుంచి హెలికాప్టర్‌లో భోగాపురం వెళతారు. ప్రధానితోపాటు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి విజయవాడ వెళతారు. ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకుని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం భోగాపురం వెళతారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి నగరానికి చేరుకుని, ఇక్కడ నుంచి భోగాపురం వెళతారు. -


నగరం నుంచి 1,465 బస్సులు

అనకాపల్లి నుంచి 500...

శనివారం ఉదయం, సాయంత్రం అత్యవసరమైన వారు మినహా

మిగిలినవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి

పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్జీ

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు విశాఖ నగరం నుంచి 1,465 బస్సులు, అనకాపల్లి నుంచి 500, అల్లూరి జిల్లా నుంచి 23 బస్సుల్లో జనాలను తరలిస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఈ బస్సులన్నీ మూడు ప్రధాన రహదారుల్లో భోగాపురం వెళతాయన్నారు. అనకాపల్లి నుంచి వెళ్లే బస్సులు సబ్బవరం, ఆనందపురం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకుంటాయన్నారు. భీమిలి నియోజకవర్గం నుంచి బస్సులు తగరపువలస మీదుగా సభాప్రాంగణానికి వెళతాయన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి బస్సులు అడవివరం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుని భోగాపురం వెళతాయన్నారు. ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల బస్సులు తాటిచెట్లపాలెం జంక్షన్‌, మద్దిలపాలెం, కొమ్మాది మీదుగా భోగాపురం వెళతాయన్నారు. పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల నుంచి బస్సులు ఎన్‌ఏడీ, వేపగుంట, సరిపల్లి మీదుగా ఆనందపురం చేరుకుని భోగాపురం వెళతాయన్నారు. శనివారం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నగరవాసులు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీపీ కోరారు. నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు, పార్కింగ్‌, మార్గం తెలిసేలా ఎక్కడికక్కడ సూచికలు ఏర్పాటుచేశామన్నారు. శనివారం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదిగంటలు వరకు లంకెలపాలెం జంక్షన్‌ నుంచి నగరంలోకి వాహనాలను అనుమతించబోమన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే భారీ వాహనాలను నగరం లోపలకు అనుమతించబోమన్నారు. విలేకరుల సమావేశంలో ఐజీ రాజకుమారి, డీసీపీ మేరీప్రశాంతి, ఏడీసీపీ అన్నెపు నర్సింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


ప్రధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

పోలీస్‌ ఉన్నతాధికారులకు

హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశం

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

ప్రధాని నరేంద్రమోదీ భోగాపురం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. పోలీస్‌ కమిషనరేట్‌లో డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా, సీపీ శంఖబ్రత బాగ్చితోపాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులతో ప్రధాని పర్యటన బందోబస్తుపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేయాలన్నారు. ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుని అమలుచేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ మళ్లింపునకు సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు, ఇతర చర్యలపై ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇతర ప్రభుత్వ శాఖలు, విభాగాలతో సమన్వయం చేసుకోవడం ద్వారా పర్యటనను విజయవంతం చేయాలన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 01:20 AM