కలుషిత నీటి సరఫరాపై ఎమ్మెల్యే ఆగ్రహం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:56 AM
స్థానిక మేజర్ పంచాయతీలో కొళాయిల ద్వారా కలుషిత తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ‘తాగునీరు కలుషితం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు స్పందించిన ఆయన మధ్యాహ్నం అధికారులతో కలిసి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతున్న గౌరీపట్నం వద్ద పెద్దేరు నది ఒడ్డున ఏర్పాటు చేసిన పంపుహౌస్‌ను పరిశీలించారు.
గౌరీపట్నం వద్ద పంపుహౌస్ పరిశీలన
శుద్ధి చేయకుండా నీటిని పంపింగ్ చేయడంపై మండిపాటు
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
చోడవరం, మార్చి2(ఆంధ్రజ్యోతి): స్థానిక మేజర్ పంచాయతీలో కొళాయిల ద్వారా కలుషిత తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ‘తాగునీరు కలుషితం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు స్పందించిన ఆయన మధ్యాహ్నం అధికారులతో కలిసి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతున్న గౌరీపట్నం వద్ద పెద్దేరు నది ఒడ్డున ఏర్పాటు చేసిన పంపుహౌస్‌ను పరిశీలించారు. పంపుహౌస్‌లో సంపు ద్వారా వస్తున్న నీరు వడపోత లేకుండా నేరుగా సరఫరా అవుతున్నట్టు గమనించిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచినీటి ట్యాంకుల వద్ద నీటిని శుద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట డిస్ట్రిబ్యూషన్ వాల్వులు ఏర్పాటు చేసి అన్ని వార్డులకు సమానంగా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ సీహెచ్‌వీ నరసింగరావు, పంచాయతీ ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.