Share News

గుడివాడ అమర్‌ పేరుతో వాహనం పాస్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 01:03 AM

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కశింకోట మండలానికి చెందిన ఒక వైసీపీ నాయకుడు.. తన కారుకు కాలం చెల్లిన ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌ అతికించుకొని దర్జాగా తిరుగుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేరుతో ఈ స్టిక్కర్‌ వుంది. ఆయన మాజీ అయి రెండేళ్లు దాటింది. దీంతో కారు పాస్‌ (స్టిక్కర్‌)కు కాలం చెల్లింది. అయినప్పటికీ కారుకు వున్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను తొలగించకుండా దర్జాగా రోడ్లపై తిరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

గుడివాడ అమర్‌ పేరుతో వాహనం పాస్‌
కొత్తూరు కళాశాల కూడలిలో కారుతోపాటు డ్రైవర్‌ను ఫొటో తీస్తున్న ఎంవీఐ కావ్య

మాజీ అయి రెండేళ్లయినా తొలగించకుండా దర్జాగా తిరుగుతున్న వైనం

రవాణా శాఖ ఎంవీఐ తనిఖీలో బట్టబయలు

ఇన్స్యూరెన్సు, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, సరైన నంబర్‌ ప్లేట్‌ లేకపోవడంతో రూ.5,300 జరిమానా

ఎమ్మెల్యే స్టిక్కర్‌ వాడకంపై చర్యలు శూన్యం

కొత్తూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కశింకోట మండలానికి చెందిన ఒక వైసీపీ నాయకుడు.. తన కారుకు కాలం చెల్లిన ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌ అతికించుకొని దర్జాగా తిరుగుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేరుతో ఈ స్టిక్కర్‌ వుంది. ఆయన మాజీ అయి రెండేళ్లు దాటింది. దీంతో కారు పాస్‌ (స్టిక్కర్‌)కు కాలం చెల్లింది. అయినప్పటికీ కారుకు వున్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను తొలగించకుండా దర్జాగా రోడ్లపై తిరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) కావ్య గురువారం అనకాపల్లి మండలం కొత్తూరు ఏఎంఏఎల్‌ కళాశాల కూడలిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ విషయం బయటపడింది. ఈ సమయంలో కారులో సదరు వైసీపీ నాయకుడు లేరు. డ్రైవర్‌ మాత్రమే వున్నారు. ఎంవీఐ కావ్య.. కారుతోపాటు రికార్డులను పరిశీలించారు. థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్సు రెన్యూవల్‌ చేయకపోవడం, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం, నిబంధనల ప్రకారం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్‌ లేకపోవడంతో నిబంధనల ప్రకారం మొత్తం రూ.5,300 జరిమానా విధించారు. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను పరిశీలించగా.. అది గుడివాడ అమర్‌నాథ్‌ పేరుతో వున్నట్టు గుర్తించారు. తరువాత కారును సీజ్‌ చేసి, సర్వీసింగ్‌ సెంటర్‌కు తరలించారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ను తొలగింపజేశారు. కాగా కాలం చెల్లిన ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌తో తిరుగుతున్నప్పటికీ కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆమెను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆ అంశం తమ పరిధిలోకి రాదని, పోలీసులే తగు చర్యలు తీసుకోవాల్సి వుంటుందని బదులిచ్చారు.

Updated Date - Jul 17 , 2026 | 01:03 AM