ఎమ్మెల్యే అన్యాయం చేశారు
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:40 PM
స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తమకు అన్యాయం చేశారని ఈ ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నేతలు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి స్వయంగా ఫిర్యాదు చేశారు.
విశ్వేశ్వరరాజుపై వైసీపీ నేత సజ్జలకు జీకేవీధి, పాడేరు ఎంపీపీ పదవుల వ్యవహారంపై నేతలు ఫిర్యాదు
నేతలకు న్యాయం చేస్తానని సజ్జల హామీ
పాడేరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):
స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తమకు అన్యాయం చేశారని ఈ ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నేతలు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి స్వయంగా ఫిర్యాదు చేశారు. తమ సమస్యపై జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు తెలిపినా కనీసం పట్టించుకోలేదని ఆయనపైనా ఫిర్యాదు చేశారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో మన్యం వైసీపీలో ముసలం ఏర్పడిన సంగతి పాఠకులకు తెలిసిందే. ప్రధానంగా పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు తమకు అన్యాయం చేశారని జీకేవీధికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణ్, పాడేరు ఎంపీటీసీ సభ్యురాలు అనంతకుమారి భర్త మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోటిబాబు నాయుడు బహిరంగంగానే ఆరోపించిన సంగతి తెలిసిందే. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో జీకేవీధి ఎంపీపీగా బొబ్బిలి లక్ష్మణ్ అనే ఎంపీటీసీ సభ్యుడిని ప్రతిపాదిస్తూ, బీఫారం సైతం ఇచ్చిన ఎమ్మెల్యే ఆఖరు నిమిషంలో తన వర్గానికి చెందిన లీలాప్రసాద్ అనే వ్యక్తిని ఎంపీపీ చేశారని బాధిత ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మణ్ ఆవేదన చెందారు. ఎంపీపీని చేస్తానని తన నుంచి రూ.15 లక్షలు తీసుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా పాడేరులో ఎంపీటీసీగా గెలుపొందిన తన భార్య అనంతకుమారిని ఎంపీపీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చి అన్యాయం చేశారని మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.కోటిబాబునాయుడు, మరికొందరు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం బాధిత వైసీపీ నేతలు తాడేపల్లి వెళ్లారు. అయితే తమ సమస్యను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలపాలని పార్టీ పెద్దలు సూచించారు. దీంతో సజ్జలను కలిసి తమకు జరిగిన అన్యాయంపై కోటిబాబు, బొబ్బిలి లక్ష్మణ్, తదితరులు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారంపై తమకు న్యాయం జరిగేలా చూస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారని బాధిత వైసీపీ నేతలు తెలిపారు.