పోర్టబిలిటీ దుర్వినియోగం
ABN , Publish Date - May 12 , 2026 | 01:26 AM
పౌర సరఫరాల శాఖ కల్పించిన పోర్టబిలిటీ (వేరొక ప్రాంతానికి చెందిన వారికి సరుకులు ఇవ్వడం) వెసులుబాటు దుర్వినియోగం అవుతోంది.
ఇతర డిపోల పరిధిలోకి కొందరు డీలర్ల చొరబాటు
బియ్యానికి బదులు నగదు...
...దాంతో కొరవడుతున్న సమతుల్యత
కొన్ని డిపోల్లో సరుకు మిగిలిపోతున్న వైనం
మరికొన్నింటికి అదనపు కోటా
విశాఖపట్నం/మహారాణిపేట, మే 11 (ఆంధ్రజ్యోతి):
పౌర సరఫరాల శాఖ కల్పించిన పోర్టబిలిటీ (వేరొక ప్రాంతానికి చెందిన వారికి సరుకులు ఇవ్వడం) వెసులుబాటు దుర్వినియోగం అవుతోంది. దీనివల్ల కొన్ని డిపోల్లో సరుకులు పూర్తిగా పంపిణీ అవుతుండగా, మరికొన్ని డిపోల్లో మూడింట ఒక వంతు మిగిలిపోతున్నాయి. సరుకులు పూర్తిగా ఇచ్చిన డిపోలకు అదనపు కోటా కోసం అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై సరుకులు మిగిలిపోయిన డీలర్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. స్టాకు ఉన్న డిపో నుంచి సరుకులను అవసరమైనచోటకు తరలించడం లేదా కార్డుదారులకు ఇవ్వడం కాకుండా అదనపు కోటా కేటాయించడం వల్ల పౌర సరఫరాల సంస్థపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు.
ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం కార్డుదారులకు సరుకులు అంటే బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు పంపిణీ చేస్తుంటారు. పదో తేదీ సాయంత్రం తరువాత డిపోల్లో ఉన్న స్టాకును పరిగణనలోకి తీసుకుని అవసరమైన డిపోలకు అదనపు కోటా ప్రతిపాదిస్తారు. అయితే సరుకులు మిగిలిన డిపోల నుంచి అవసరమున్న డిపోలకు మళ్లించాల్సి ఉన్నా...అందుకు భిన్నంగా కొన్ని డిపోలకు అదనపు కోటా ప్రతిపాదిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వన్‌టౌన్ ఏరియాలో డిపో నంబరు 148కు 9,450 కిలోల బియ్యం కేటాయించగా, సోమవారం నాటికి 3,817 కిలోలు ఉన్నాయి. అలాగే డిపో నంబరు 254కు 12,200 కిలోలు కేటాయించగా ఇంకా 4,863 కిలోలు, 44 నంబరు డిపోకు 17,150 కిలోలు కేటాయించగా 5,846 కిలోలు, 259 నంబర్ డిపోకు 14,230 కిలోలకుగాను 4,773 కిలోలు, డిపో నంబరు 238కు 12,725 కిలోలకుగాను ఇంకా 5,512 కిలోలు బియ్యం ఉండిపోయాయి. అదే సమయంలో డిపో నంబరు 265కు 10,170 కిలోలకుగాను కేవలం 25 కిలోలు, డిపో 146కు 13,620 కిలోలకు 1,000కిలోలు మాత్రమే నిల్వలు ఉన్నాయి.
ఒకే ప్రాంతంలో సరుకులు ఉన్న డిపో నుంచి సరుకులు లేని డిపోకు కేటాయించే అవకాశం ఉంది. లేదా కార్డుదారులకు సమాచారం ఇవ్వాలని డీలర్లకు అధికారులు సూచించే అవకాశం ఉంది. కానీ పోర్టబిలిటీని అడ్డంపెట్టుకుని తన డిపోతో అనుసంధానం కాని బియ్యం కార్డులకు సరుకులు ఇచ్చే డీలర్లకు ప్రయోజనం కలిగించేలా పౌర సరఫరాల శాఖలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అదనపు కోటాకు ప్రతిపాదిస్తున్నారు. నగరంలో మూడు సర్కిళ్లల్లో సుమారు 450 డిపోలు ఉండగా వలస ప్రజలు ఎక్కువగా ఉండే ఆరిలోవ, మధురవాడ, గాజువాక, పెందుర్తి, వేపగుంట, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం ప్రాంతాలకు అదనపు కోటా అవసరం పడుతుంది. ఇక్కడ కూడా అదనపు కోటా ఇచ్చే ముందు ఈ ప్రాంతంలో సరుకులు ఉండే డిపోలను గుర్తించి అక్కడ నుంచి సరుకులు అవసరం ఉన్న డిపోలకు మళ్లించవచ్చు. అయితే పెద్దగా వలసలు లేని వన్‌టౌన్‌లో పలు ప్రాంతాల్లో బియ్యం కొనుగోలు చేసే కొందరు డీలర్లు అన్ని ప్రాంతాలకు వెళ్లి కార్డుదారులకు సరుకులకు బదులు సొమ్ములు ఇస్తున్నారు. ఇటువంటి వారే అదనపు కోటా కోసం వెంపర్లాడుతున్నారు. దీనిపై జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కరరావు వద్ద ప్రస్తావించగా అవసరమైన డిపోలకు అదనపు కోటా ఇవ్వాలని చెకింగ్ ఇన్‌స్పెక్టర్ల నుంచి ప్రతిపాదనలు కోరామన్నారు. ఎక్కువగా సరుకులు మిగిలిన డిపోలకు వెళ్లి సరుకులు తీసుకోవాలని కార్డుదారులకు తమ సిబ్బంది సూచిస్తున్నారని అన్నారు.