ప్రసాద్ నిధులు దుబారా
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:08 AM
పుణ్యక్షేత్రాల ఆధునికీకరణ, అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకం కింద మంజూరుచేసిన నిధులు సింహాచలంలో దుర్వినియోగం అవుతున్నాయి.
పథకం కింద సింహగిరికి రూ.50 కోట్లు
అందులో రూ.2 కోట్లతో ‘ఈ-వాహనాలు’ కొనుగోలు చేసిన పర్యాటక శాఖాధికారులు
భక్తుల కోసం ఉపయోగించాలని దేవస్థానం అధికారులకు సూచన
అవి బహిరంగ ప్రదేశాల్లో ప్రజా రవాణాకు ఉపయోగపడవని ముందే స్పష్టం చేసిన తయారీ సంస్థ
ఇప్పుడు బీచ్‌రోడ్డులో తిప్పుతామంటూ ప్రభుత్వానికి లేఖ!
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పుణ్యక్షేత్రాల ఆధునికీకరణ, అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకం కింద మంజూరుచేసిన నిధులు సింహాచలంలో దుర్వినియోగం అవుతున్నాయి. ఈ పథకం కింద మూడేళ్ల క్రితం రూ.50 కోట్లు మంజూరు చేయగా...వాటితో కొన్ని కొత్త నిర్మాణాలు చేపట్టారు. సివిల్ పనులే కాకుండా భక్తులకు రవాణా సౌకర్యం పేరుతో ఈ-వాహనాలు కూడా ఆ నిధులతోనే కొనుగోలు చేశారు. ఎనిమిది వాహనాలకు సుమారు రూ.రెండు కోట్ల వరకు వెచ్చించారు. అవి దేవస్థానానికి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటివరకూ వినియోగంలోకి తీసుకురాలేదు. వాటిని ప్రజా రవాణా వ్యవస్థకు ఉపయోగించకూడదని సరఫరా చేసిన సంస్థే స్పష్టం చేయడంతో దేవస్థానం అధికారులు ఇన్నాళ్లూ షెడ్లలోనే ఉంచారు. నెల రోజుల క్రితం వాటిని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులకు అప్పగించారు. దాంతో అవి సిటీలోని అప్పుఘర్ వద్ద ఉన్న యాత్రీనివాస్ వద్దకు చేరుకున్నాయి. అక్కడ ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి.
ప్రజా రవాణా వ్యవస్థకు పనికిరావు
పర్యాటక శాఖ అధికారులు ‘అక్విలా ఈవీ’ అనే సంస్థ నుంచి ఆరు ఈ-మినీ బస్సులను కొనుగోలు చేశారు. అవి ఏ విధంగా ఉపయోగపడతాయో పూర్తిగా తెలుసుకోకుండానే కమీషన్‌ల కోసం కక్కుర్తిపడ్డారు. అయితే అక్విలా ఈవీ సంస్థ మాత్రం వాటిని ఎలా వినియోగించాలో ఒక లేఖ ద్వారా స్పష్టంగా తెలియజేసింది. వాటిని ప్రజా రవాణా వ్యవస్థకు ఉపయోగించకూడదని పేర్కొంది. గేటెడ్ కమ్యూనిటీలు, ఇంకా విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థల్లో అంతర్గత రహదారులపై మాత్రమే నడపాలని పేర్కొంది. అంటే రిసార్ట్స్, విమానాశ్రయాలు, కార్పొరేట్ విశ్వవిద్యాలయాలు, బ్రాండిక్స్ వంటి పెద్ద సంస్థలు వాటి ప్రాంగణాల్లో మాత్రమే నడుపుకోవాలి. ఆ మినీ బస్సుల గరిష్ఠ వేగం గంటకు 20 కి.మీ. వాటిని ఇతర వాహనాల్లా ఆర్‌టీఓ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయరు. రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఇవి నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు. పూర్తిగా ప్రైవేటు అవసరాలకు క్లోజ్డ్ ఏరియాలోనే వినియోగించాలి.
ఈ విషయాలన్నీ ముందుగా తెలియదేమో సింహాచలంలో భక్తులను కొండ పైనుంచి కిందికి, కింద నుంచి పైకి తీసుకువెళ్లడానికి ఉపయోగించాలని దేవస్థానం రవాణా విభాగానికి అప్పగించారు. గంటకు 20 కి.మీ. వేగంతో ప్రయాణించే ఆ ఎలక్ర్టిక్ మినీ బస్సులు ఘాట్ రోడ్డు ఎక్కవని, మధ్యలో ఆగిపోతే భక్తుల ప్రాణాలకు ప్రమాదమని అధికారులు వాటిని ఉపయోగించలేదు. వీటిపై గతంలోను పత్రికల్లో కథనాలు వచ్చినా పర్యాటక శాఖాధికారులు స్పందించలేదు. ఇప్పుడు వాటిని ఏపీటీడీసీకి అప్పగించారు. వారు బీచ్ రోడ్డులో పర్యాటకులను తిప్పడానికి అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. రవాణా శాఖ రిజిస్టర్ చేయని వాహనాలకు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ విషయం తెలుసుకోకుండానే వాటిని పర్యాటకులకు ఉపయోగిస్తామని ఇక్కడి అధికారులు లేఖ రాయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ బస్సులను సాధారణ రహదారులపై ఉపయోగించడానికి అవకాశం లేదు. వాటిని వేలం ద్వారానో, మరో విధానంలోనో జీఎంఆర్ విమానాశ్రయానికో, విద్యా సంస్థలకో అమ్ముకుంటే కొంతలో కొంత రికవరీ అవుతుంది. ఇంకో ఆరు నెలలు పక్కన పెడితే అవి ఎందుకూ పనికిరాకుండా పోతాయి. దాదాపు రెండు కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టవుతుంది. ఈ నిధులు దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ సమీక్షించాల్సిన అవసరం ఉంది.