మిషన్ పునర్వనం భేష్
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:49 AM
వృక్షో రక్షతి రక్షితః అనే నానుడిని సార్థకం చేస్తూ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ చేపట్టిన ‘మిషన్ పునర్వనం’ కార్యక్రమం భేషుగ్గా వుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం శాసనసభ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణ కోసం వందేళ్లకుపైబడిన భారీ వృక్షాలను తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.
ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను మెచ్చుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాష్ట్రమంతటా అమలు చేసేలా విధివిధానాలు రూపొందిస్తామని వెల్లడి
అచ్యుతాపురం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వృక్షో రక్షతి రక్షితః అనే నానుడిని సార్థకం చేస్తూ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ చేపట్టిన ‘మిషన్ పునర్వనం’ కార్యక్రమం భేషుగ్గా వుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం శాసనసభ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణ కోసం వందేళ్లకుపైబడిన భారీ వృక్షాలను తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణణ్ కలిసి ‘మిషన్ పునర్వనం’ పేరుతో భారీ వృక్షాలను కూకటివేళ్లతో పెకలించి వేరేచోట నాటించారని, తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని, వేరేచోట నాటిన వృక్షాలు చిగురించాయని తెలిపారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మిషన్ పునర్వనం కార్యక్రమానికి సంబంధించిన వివరాలను విజయకుమార్‌ని అడిగి తెలుసుకున్నారు. భారీ వృక్షాలను వేళ్లతో సహా తొలగించడం, ఇతర ప్రదేశాలకు తరలింపు, నాటటడం వంటి వివరాలను ఫొటోలతో సహా పవన్‌కల్యాణ్‌కు చూపించారు. పర్యావరణ పరిరక్షణకు ఈ తరహా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేలా నెల రోజుల్లో విధివిధానాలను రూపొందిస్తామని పవన్‌కల్యాణ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ని అభినందించారు.