Share News

ఆచూకీ లేని షీ టీమ్స్‌

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:29 AM

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఆహార కల్తీ జరగకుండా నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన ‘శానిటేషన్‌, హెల్త్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (షీ)’ బృందాలు ఆచూకీ లేవు.

ఆచూకీ లేని షీ టీమ్స్‌

అంతా మూన్నాళ్ల ముచ్చటేనా?

జీవీఎంసీ పరిధిలో ఆహార కల్తీని అడ్డుకునేందుకు ఆరు నెలల కిందట జోన్‌కొక బృందం ఏర్పాటు

హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో తనిఖీలు చేయాల్సిందిగా నిర్దేశం

ఆరంభంలో హడావిడి...ఇప్పుడు కనిపించని వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఆహార కల్తీ జరగకుండా నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన ‘శానిటేషన్‌, హెల్త్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (షీ)’ బృందాలు ఆచూకీ లేవు. కొత్తలో హోటళ్లు, అల్పాహార దుకాణాల్లో ఎడాపెడా తనిఖీలు చేసిన ఈ బృందాలు ఆ తర్వాత ఏమయ్యాయో తెలియదు. రాజమండ్రిలో కల్తీ పాల ఉదంతం నేపథ్యంలో షీటీమ్స్‌ను తిరిగి క్రియాశీలకం చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

వ్యాపారం బాగుండడంతో నగరంలో ఎక్కడికక్కడ హోటళ్లు, అల్పాహార సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. అయితే లాభార్జనే ధ్యేయంగా కొందరు ఆహార తయారీలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. హానికరమైన రంగులను వినియోగిస్తున్నారు. దీనివల్ల చాలామంది అనారోగ్యం బారినపడుతున్నారు. కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆరు నెలల కిందట ‘షీ’ టీమ్స్‌కు రూపకల్పన చేశారు. ఒక్కో టీమ్‌లో ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌, ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఇద్దరు వార్డు శానిటరీ సెక్రటరీలను నియమించారు. ఒక్కో జోన్‌కు ఒక్కో బృందం చొప్పున పది బృందాలను ఏర్పాటుచేశారు. ఆయా బృందాలు తమ జోన్‌ పరిధిలోని హోటళ్లు, బేకరీలు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. హోటల్‌/బేకరీ/ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ లోపల పరిశుభ్రత, వినియోగదారులకు అవసరమైన సదుపాయాల కల్పన, ఆహార తయారీ విధానం, అందుకు వినియోగిస్తున్న పదార్థాల నాణ్యతను పరిశీలించాలి. ఎక్కడైనా నాణ్యత లోపించినా, ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను వినియోగించినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులైన వారిపై కేసులు నమోదుచేయించడం, జరిమానా విధించడం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నాణ్యతను నిర్ధారించడంలో కొన్ని అనుమానాలు ఉంటే నమూనాలను తీసి స్టేట్‌ ఫుడ్‌ సేఫ్టీ టెస్టింగ్‌ ల్యాబ్‌కు పంపించాలి. నాణ్యతాలోపం ఉన్నట్టు లేదా ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను వినియోగిస్తున్నట్టుగానీ తేలితే దుకాణాలపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తారు.

షీ టీమ్స్‌ ఏర్పాటుచేసిన మొదట్లో ఆయా చాలా హడావిడి చేశాయి. తమ పరిధిలోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తనిఖీలు చేసి విరివిగా జరిమానాలు విధించాయి. కానీ తర్వాత ఏమైందోగానీ బృందాల జాడలేకుండా పోయింది. ఇటీవల కాలంలో హోటళ్లలో ఆహారకల్తీ, నిల్వ పదార్థాలు వినియోగం పెరిగిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజమండ్రిలో కల్తీపాల నేపథ్యంలో అధికారులు స్పందించి ’షీ’ టీమ్స్‌ను తిరిగి క్రియాశీలకం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 01:29 AM