గూగుల్ డేటా సెంటర్‌పై దుష్ప్రచారం
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:14 AM
విశాఖలో ఏర్పాటుకానున్న గూగుల్ డేటా సెంటర్లపై కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని ఎంపీ శ్రీభరత్ కోరారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే
విశాఖ భవిష్యత్తుకు డేటా సెంటర్లు కీలకం
ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
విశాఖలో ఏర్పాటుకానున్న గూగుల్ డేటా సెంటర్లపై కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని ఎంపీ శ్రీభరత్ కోరారు. విశాఖ భవిష్యత్తుకు డేటా సెంటర్లు కీలకమని, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. జీవీఎంసీ ప్రధానకార్యాలయంలో కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి భవిష్యత్తులో నీటికొరత ఏర్పడుతుందని, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని, పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతుందనే పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. పోలవరం ఎడమకాలువ, డీశాలినేషన్ ప్రాజెక్టుల ద్వారా 2,110 ఎంఎల్‌డీ నీరు అదనంగా నగరానికి వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రజలు, పరిశ్రమల అవసరాలకు 410 ఎంఎల్‌డీ నీటిని వినియోగిస్తున్నారని, భవిష్యత్తులో పెరిగే జనాభా, డేటా సెంటర్లు, పరిశ్రమలు ఇతర మౌలిక సదుపాయాలకు గరిష్టంగా 1500 ఎంఎల్‌డీ అవసరమన్నారు. ఇంకా 500 ఎంఎల్‌డీకి పైగా నీరు అందుబాటులో ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగంపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదన్నారు. రానున్న పెద్దఎత్తున పునరుత్పాదక విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. డేటా సెంటర్ వల్ల వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు వచ్చినా, అనుబంధంగా వచ్చే హైటెక్ పరిశ్రమలు, బ్యాంకులు ఇతర సంస్థల ద్వారా వేలసంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని, పెట్టుబడులు, ఉపాధి పెరగడం వల్ల రాష్ట్ర ఆర్థికవృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందన్నారు. చెట్లను నరికేస్తున్నారని కొందరు వీడియోలు పోస్ట్‌చేస్తున్నారని, ఒకచోట చెట్లను తొలగిస్తే మరోచోట నాటుతున్నామన్నారు. రాష్ట్రంలో గతంతో పోల్చితే ఇప్పుడు చెట్ల సంఖ్య పెరిగిందన్నారు. డేటా సెంటర్ వల్ల శబ్దాలు పెరిగిపోతాయని చెబుతున్నారని, ఇంట్లో ఏసీ మాదిరిగానే అక్కడ ఏసీల వల్ల శబ్దం వస్తున్నారు. గూగుల్ పేరుతో అదానీడేటా సెంటర్ పెడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారని, గూగుల్‌డేటా సెంటర్లు ఏర్పాటుచేసినపుడు స్థానికంగా ఉండే అనుభవం కలిగిన సంస్థల సహకారం తీసుకుంటారని, అందులో భాగంగానే అదానీ, ఎయిర్‌టెల్ సంస్థలను భాగస్వాములుగా తీసుకున్నారన్నారు. వీటన్నింటిపైనా ఆరోపణలు చేస్తున్నవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను అడ్డుకోవడం, తమ రాష్ట్రాలకు తరలించుపోయేందుకే ఇలా చేస్తున్నారనే అనుమానం తలెత్తుతోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం కూడా ప్రభుత్వానికి శిక్షే అన్నట్టు తయారయ్యారని, మన రాష్ట్రం వద్దనుకుంటే ఇతర రాష్ట్రాలు, దేశాలు డేటా సెంటర్లను తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. బీచ్‌లో త్వరలో ఏర్పాటుచేయబోయే బీచ్‌సాక్స్‌లో కేవలం బీర్, వైన్ మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఒక ఎన్జీవో పర్యావరణ పరిరక్షణకోసం చేపట్టిన కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చిని ఆహ్వానిస్తే ఆయన వెళ్లి వారికి ప్రోత్సాహం అందిస్తామని చెబితే, దానిని కొందరు డేటా సెంటర్‌కు సీపీ వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేశారన్నారు. దీనిపై సీపీ ఫిర్యాదు చేయడంతో బాధ్యులపై కేసు నమోదుచేస్తామని స్పష్టం చేశారన్నారు.