Share News

మినుములూరు పంచాయతీ ఆదర్శవంతం

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:40 PM

పంచాయతీలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్రం అందించిన సాయాన్ని సద్వినియోగం చేసుకుని మండలంలోని మినుములూరు పంచాయతీ ఆదర్శంగా నిలిచింది.

మినుములూరు పంచాయతీ ఆదర్శవంతం
కేంద్ర ప్రభుత్వ నిధులతో మినుములూరులో నిర్మించిన దుకాణాలు

కేంద్ర ప్రభుత్వ సాయం సద్వినియోగం

రూ.8 లక్షలతో దుకాణాల నిర్మాణం

సుస్థిర ఆదాయం కోసం నిర్ణయం

పాడేరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): పంచాయతీలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్రం అందించిన సాయాన్ని సద్వినియోగం చేసుకుని మండలంలోని మినుములూరు పంచాయతీ ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్‌ మినుములూరు పంచాయతీలో 2022లో పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, పంచాయతీ పరిధిలోని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మినుములూరు పంచాయతీ ఏజెన్సీ ప్రాంతానికి ఆదర్శంగా ఉందని కితాబిచ్చారు. దీంతో పంచాయతీని దీన్‌ దయాల్‌ పంచాయతీ పురస్కారానికి ఎంపిక చేసి జాతీయ స్థాయిలో ఆదర్శ పంచాయతీగా గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదర్శ గ్రామ పంచాయతీలు మరింత ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ.8 లక్షలను మంజూరు చేసింది.

రూ.8 లక్షలతో దుకాణాల నిర్మాణం

దీన్‌ దయాల్‌ పంచాయతీ పురస్కారం ద్వారా మినుములూరు పంచాయతీకి మంజూరు చేసిన రూ.8 లక్షల నిధులతో పంచాయతీ ఆర్థిక సుస్థిరతకు వ్యయం చేయాలని పంచాయతీ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయా నిధులతో రెండు దుకాణాలను నిర్మించారు. వాటిని అద్దెలకు ఇవ్వడం ద్వారా పంచాయతీకి సుస్థిరమైన ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అందుకు కృషి చేసిన పంచాయతీ అభివృద్ధి అధికారి మిరియాల వెంకట సాయి అనుషాను డివిజన్‌ పంచాయతీ అధికారి పీఎస్‌.కుమార్‌, ఇతర అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. మినుములూరు పంచాయతీని ఆదర్శంగా తీసుకుని ఏజెన్సీలో పంచాయతీలు అభివృద్ధి కావాలని ఆయన సూచించారు.

Updated Date - Jul 22 , 2026 | 10:40 PM