Share News

మాస్టర్‌ ప్లాన్‌పై మంత్రి సమీక్ష

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:40 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ ప్లాన్‌-2041ను త్వరితంగా ఖరారు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణ ఆదేశించారు.

మాస్టర్‌ ప్లాన్‌పై మంత్రి సమీక్ష

త్వరగా ఖరారు చేయాల్సిందిగా వీఎంఆర్‌డీఏ అధికారులకు ఆదేశాలు

పెట్రో కెమికల్‌ పెట్రో ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌కు కూడా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని సూచన

ఎంఐజీ లేఅవుట్లు, ల్యాండ్‌ పూలింగ్‌పై ఆరా

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ ప్లాన్‌-2041ను త్వరితంగా ఖరారు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణ ఆదేశించారు. విజయవాడలో వీఎంఆర్‌డీఏ అధికారులతో ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అభ్యంతరాలను వెంటనే పరిశీలించి, తుది ముసాయిదా విడుదల చేయాలన్నారు. అదేవిధంగా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు ప్రతిపాదించిన సెమీ రింగ్‌ రోడ్డు ప్రణాళిక గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం-కాకినాడ పెట్రో కెమికల్‌ పెట్రో ఇన్వెస్టిమంట్‌ రీజియన్‌కు కూడా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని సూచించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న రహదారులను త్వరితంగా పూర్తిచేయాలన్నారు. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న ప్రాజెక్టులను సమీక్షించి పలు సూచనలు చేశారు. విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ ప్రణాళిక అడిగి తెలుసుకున్నారు. ఎంఐజీ లేఅవుట్లు, ల్యాండ్‌ పూలింగ్‌ వంటి అంశాలు సమీక్షించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌, డైరెక్టర్‌ సంపత్‌కుమార్‌, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌భరత్‌, జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌, ప్లానింగ్‌ డైరెక్టర్‌ విద్యుల్లత, ఇతర అధికారులు పాల్గొన్నారు.


తర్లువాడలో సెమీ కండక్టర్‌ పరిశ్రమకు 22 ఎకరాలు

గూగుల్‌కు సమీపంలోనే కేటాయింపు

త్వరలో మరో 2 ఐటీ కంపెనీలు రాక

ఓ కంపెనీకి ఎండాడలో 20 ఎకరాలు..

జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం తర్లువాడలో సెమీ కండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌ కంపెనీకి 22 ఎకరాలు కేటాయించినట్టు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ వెల్లడించారు. గురువారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ పరిశ్రమ చిప్స్‌ తయారుచేస్తుందన్నారు. తర్లువాడలో గూగుల్‌కు ఇచ్చిన 308 ఎకరాలకు సమీపంలోనే కొండవాలు ప్రాంతంలో ఈ 22 ఎకరాలు ఉందన్నారు. ఆ భూములు ఏపీఐఐసీకి అప్పగించనున్నామని, వారు అభివృద్ధి చేసి ఆ కంపెనీకి అందజేస్తారని తెలిపారు. ఇందులో రూ.2,387.81 కోట్లతో సెమీ కండక్టర్‌ అసెంబ్లింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటవుతుందని, నేరుగా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాకు మరో రెండు పెద్ద ఐటీ కంపెనీలు రాబోతున్నాయని, దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు నడిచాయని వివరించారు. ఇప్పటికే ఒక సంస్థకు ఎండాడలో 20 ఎకరాలు సిద్ధంగా ఉంచామన్నారు. మరికొన్ని కంపెనీలు కూడా జిల్లాలో భూములు కావాలని కోరుతున్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.


డేటా సెంటర్‌కు 60 ఎకరాలు అవసరం

ప్రభుత్వానికి ‘సిఫీ’ ప్రతిపాదన

పరదేశిపాలెంలో ఇప్పటికే 25 ఎకరాలు కేటాయింపు

అదనపు భూమి కోసం సంస్థ ప్రయత్నాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

ప్రముఖ ఐటీ సంస్థ ‘సిఫీ’కి డేటా అండ్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిమిత్తం ప్రభుత్వం పరదేశిపాలెంలో 25 ఎకరాలు కేటాయించింది. అయితే కనీసం 60 ఎకరాలు కావాలని ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. దేశంలో పలు నగరాల్లో డేటా, కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్న సిఫీ విశాఖలో కార్యకలాపాలు చేపట్టేందుకు ముందుకువచ్చింది. ఆ కంపెనీకి ప్రభుత్వం మధురవాడ ఐటీ పార్కులో హిల్‌-3పై మూడెకరాలు కేటాయించగా, గత నెలలో సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పరదేశిపాలెంలో మరో 25 ఎకరాల భూమి కేటాయించారు. అయితే భారీ స్థాయిలో డేటా, ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలంటే కనీసం 60 ఎకరాలు అవసరమని సంబంధిత కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా యంత్రాంగం వద్ద అదే ప్రతిపాదన ఉంచారు. పరదేశిపాలెంలో ప్రస్తుతం కేటాయించిన 25 ఎకరాలకు ఆనుకుని మరో 10 నుంచి 15 ఎకరాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం పేర్కొన్నట్టు తెలిసింది. ఒకేచోట 60 ఎకరాలు కేటాయించాలని, పరదేశిపాలెం కాకపోతే మరోచోట ఇవ్వాలని సిఫీ కోరడంతో ఆనందపురం మండలం జగన్నాథపురంలో 60 ఎకరాలు ఇస్తామని ప్రతిపాదించారు. కానీ, మధురవాడ, కాపులుప్పాడ ప్రాంతాల్లోనే 60 ఎకరాలు ఇస్తే బాగుంటుందని సిఫీ ప్రతినిధులు కోరారు.

Updated Date - Feb 27 , 2026 | 12:40 AM