Share News

నేడు మంత్రి నారా లోకేశ్‌ రాక

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:39 AM

రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ శుక్రవారం నగరానికి రానున్నారు. తిరుపతి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

నేడు మంత్రి నారా లోకేశ్‌ రాక

డీజీ 100 ఎక్స్‌ ఏపీ సదస్సుకు హాజరు

సాగర్‌నగర్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ శుక్రవారం నగరానికి రానున్నారు. తిరుపతి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 4.40 గంటలకు రాడిసిన్‌బ్లూ హోటల్‌కు వెళ్లి డీజీ 100 ఎక్స్‌ ఏపీ సదస్సులో పాల్గొంటారు. ఎంపీ శ్రీభరత్‌ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనున్నది. రాష్ట్రంలో ఉన్నత విద్య, డిజిటల్‌ పరివర్తన, ఆధునిక సాంకేతికత అనే అంశాలపై వివిధ వర్సిటీల ప్రతినిధులు, విద్యావేత్తలతో జరిగే ఈ సదస్సులో మంత్రి ఐటీ, విద్యా రంగాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలను వెల్లడించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు హోటల్‌ నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని హైదరాబాద్‌కు పయనమవుతారు.


బడికి వేళాయె

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

కొత్తగా చేరిన విద్యార్థులకు చాక్లెట్‌ ఇచ్చి స్వాగతం పలకనున్న ఉపాధ్యాయులు

ఒకటో తరగతిలో 4,417 మంది చేరిక

గత ఏడాది కంటే అధికం

తొలిరోజు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫాం పంపిణీ

అక్కడక్కడా వసతి సమస్య

మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు

విశాఖపట్నం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి):

పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. కొత్తగా చేరిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు పువ్వు/చాక్లెట్‌/పెన్ను/బొకే ఇచ్చి స్వాగతం పలుకుతారు. అనంతరం తరగతి గదులు, మైదానం, మరుగుదొడ్లు చూపించి మిగిలిన పిల్లలతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తారు. తొలిరోజు పూర్వ విద్యార్థులు, గ్రామం/వార్డులో పెద్దలను ఆహ్వానించి వారి సందేశం వినేపించేలా ఏర్పాట్లుచేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖ ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు గ్రామాలు, నగరంలో ర్యాలీలు నిర్వహించడం, బడి ఈడు వచ్చిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను కలవడం చేశారు. దీంతో ఒకటో తరగతిలో గురువారం వరకు 4,417 మంది చేరారు. గత ఏడాది పాఠశాలలు తెరిచేనాటికి 3,400 మంది చేరారు. ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లక్ష్యం నిర్దేశించడం, అధికారులు చొరవ తీసుకోవడంతో గత ఏడాది కంటే విద్యార్థులు పెరిగారు. అయితే పద్మనాభం, ఆనందపురం, పెదగంట్యాడ మండలాల్లోని శివారు ప్రాంతాల్లో గల పాఠశాలల్లో ఇద్దరి నుంచి ఐదుగురు వరకు మాత్రమే చేరగా, మరో నాలుగు పాఠశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత ఆయా గ్రామాల్లో విద్యార్థుల చేరికలపై దృష్టిసారించాలని హెచ్‌ఎంలను డీఈవో ఆదేశించారు. ఇక ఆరో తరగతిలో ఇప్పటివరకూ 6,730 మంది చేరారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న పాఠశాలలకు సెలవులు ప్రకటించే సమయానికి ఆరో తరగతిలో 7,699 మంది విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్‌ 23 నాటికి జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 68,427 మంది విద్యార్థులు ఉండగా, గురువారం నాటికి 65,076 మంది ఉన్నారు. ప్రవేశాలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నందున గత ఏడాది కంటే విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉంటుందని డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

పాఠశాలలకు నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం చేరాయి. విద్యార్థి కిట్‌లో ఇంకా బ్యాగు, బెల్టు, బూట్లు రాలేదు. శుక్రవారం పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. బ్యాగులు, బెల్టులు, బూట్లు రాకపై ఇంకా స్పష్టత లేదు. చాలా పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు మూలనపడగా పాక్షికంగా కొన్నిచోట్ల మరమ్మతులు చేశారు. ఇదిలావుండగా ‘మన బడి-మన భవిష్యత్తు’ కింద చేపట్టిన పనులు నిధులు లేక నిలిచిపోయాయి. దీంతో కొన్నిచోట్ల వసతి సమస్య ఎదురుకానున్నది. చంద్రంపాలెం పాఠశాలలో ఎనిమిది గదులు ఇంకా అందుబాటులోకి రాలేదు. బక్కన్నపాలెం యూపీ పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేసినందున ఈ ఏడాది పదో తరగతి ప్రారంభం కానున్నది. అయితే ప్రస్తుతం పాఠశాలలో తొమ్మిది గదులే ఉండడంతో వసతి సమస్య రానున్నది. కాగా జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులున్న గాజువాక, కణితి, రెడ్డిపల్లి అగ్రహారం, ఆర్‌.తాళ్లవలస ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఇన్‌చార్జులు కొనసాగుతున్నారు. కొన్నిచోట్ల సబ్జెక్టు టీచర్లు కొరత ఉంది.

పాఠశాలలు సన్నద్ధం చేశాం

ఎన్‌.ప్రేమకుమార్‌, డీఈవో

పాఠశాలల పునఃప్రారంభం కానున్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించాం. పుస్తకాలు, యూనిఫాం విద్యార్థులకు అందించాలని సూచించాం. ఈ ఏడాది పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై ఎక్కువగా దృష్టిసారించాం. అందుకే, గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది చేరికలు పెరిగాయి. వసతుల కోసం ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న సుమారు 80 లక్షలు వెచ్చించనున్నాం.


జన సమీకరణకు వైసీపీ నేతల తిప్పలు

కూటమి పాలనపై

నేడు నిరసన కార్యక్రమాలకు

అధిష్ఠానం పిలుపు

నియోజకవర్గాల్లో ఐదేసి వేల మందితో

ర్యాలీలు నిర్వహించాలని ఆదేశం

తలలు పట్టుకుంటున్న సమన్వయకర్తలు

విశాఖపట్నం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు జన సమీకరణ తిప్పలు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ శుక్రవారం నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అధిష్ఠానం పిలుపునిచ్చింది. కనీసం ఐదు వేల మందికి తగ్గకుండా సమీకరించి ర్యాలీ చేపట్టాలని ఆదేశించింది. అయితే మండుటెండలో ర్యాలీ, సభ పూర్తయ్యేంత వరకు ఉండాలంటే ఎవరు వస్తారని నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జనాలను సమీకరించడానికి డబ్బులు ఇవ్వడంతోపాటు వారిని ఆటోల్లో తరలించడానికి, భోజనాలకు మరికొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందంటున్నారు. సమన్వయకర్తలుగా, వార్డు అధ్యక్షులుగా పదవుల్లో ఉన్నందున తప్పదని, కానీ డబ్బులు ఇస్తామని చెప్పినా పార్టీ కార్యక్రమాలకు జనాలు రావడానికి ఆసక్తిచూపడం లేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని నేతలు తలలు పట్టుకుంటున్నారు.


నగర ప్రజలంతా పాల్గొనాలి

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పిలుపు

మహారాణిపేట, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఈనెల 21వ తేదీన ఆర్‌కే బీచ్‌రోడ్డులో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాంధ్ర కార్యక్రమంలో నగర ప్రజలంతా పాల్గొని, విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నేవల్‌ డాక్‌యార్డులో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నేవల్‌ డాక్‌ యార్డులో శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే 12న రుషికొండ బీచ్‌ వద్ద, 15న ముడసర్లోవ గోల్ఫ్‌ కోర్టులో శిబిరాలు జరుగుతాయని చెప్పారు. 21న ఆర్‌కే బీచ్‌లో భారీఎత్తున యోగా డే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకా దళ వైస్‌ అడ్మిరల్‌ సుశీల్‌ మీనన్‌, జాయింట్‌ కలెక్టర్‌ జి. విద్యాధరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 01:39 AM