Share News

మంత్రి నారా లోకేశ్‌ రాక రేపు

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:46 AM

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం నగరానికి రానున్నారు.

మంత్రి నారా లోకేశ్‌ రాక రేపు

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ సోమవారం నగరానికి రానున్నారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఉదయం 9.10 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఎండాడ వచ్చి, ఏఐజీ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి పోర్టు గెస్ట్‌హౌస్‌కు సమీపంలో వాల్తేర్‌ క్లబ్‌ గేటు ఎదురుగా ఏర్పాటుచేసిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం గంభీరం ఐఐఎంకు సమీపంలో ఏర్పాటుచేసే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడ బయలుదేరి వెళతారు.


రిసార్టులో గొడవపై విచారణ

పార్టీ ఏర్పాటుచేసిన బ్యూటీషియన్‌ సహా 32 మంది వాంగ్మూలాల సేకరణ

మద్యం వినియోగంపై ఎక్సైజ్‌ శాఖ దర్యాప్తు

డిఫెన్స్‌ మద్యం సేవించినట్టు నిర్ధారణ

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

బర్త్‌డే పార్టీలో ఇద్దరు యువకుల మధ్య వివాదం...కత్తులు దూసుకున్న ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆనందపురం మండలం గండిగుండం సమీపంలోని ఎస్‌.ఆర్‌.పురం హ్యాపీ నేచర్‌ రిసార్టులో ఈనెల 26న నగరానికి చెందిన బ్యూటీషియన్‌ ఒకరు తన పుట్టినరోజు సందర్భంగా లేట్‌నైట్‌పార్టీ ఏర్పాటుచేసి నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న తన స్నేహితులు, పరిచయస్తులను ఆహ్వానించారు. అంతా మద్యం సేవించి ఎంజాయ్‌ చేస్తుండగా ఒక యువతితో డ్యాన్స్‌ చేసే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉల్లిపాయలు కట్‌ చేసే కత్తితో దాడి చేయడంతో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం బయటకుపొక్కడంతో ఆనందపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ పార్టీలో మద్యంతోపాటు డ్రగ్స్‌ వినియోగం కూడా జరిగిందనే ప్రచారం జరుగుతుండడంతో సీపీ శంఖబ్రతబాగ్చి సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆనందపురం పోలీసులను ఆదేశించారు. సీఐ ఎర్రంనాయుడు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరాలతోపాటు ఇతర వివరాలు ఆధారంగా పార్టీ ఏర్పాటుచేసిన బ్యూటీషియన్‌తోపాటు రిసార్టు యజమాని, నిర్వాహకుడిని స్టేషన్‌కు పిలిచి విచారించారు. వారి నుంచి పార్టీకి హాజరైనట్టు చెబుతున్న 32 మంది పేర్లు, ఫోన్‌ నంబర్లు తీసుకుని వారిని కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఎక్సైజ్‌ పోలీసులు కూడా ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. అక్కడ మద్యం వినియోగానికి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో భీమిలి ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాసరావు పార్టీ ఏర్పాటుచేసిన బ్యూటీషియన్‌తోపాటు రిసార్టు యజమాని, ప్రస్తుతం రిసార్టు నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి వాంగ్మూలం సేకరించారు. డిఫెన్స్‌ మద్యం పంపిణీ చేసినట్టు వారంతా చెప్పడంతో ఎవరు సరఫరా చేశారు, గతంలో ఎన్నిసార్లు సరఫరా చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ముగ్గురిని బైండోవర్‌ చేయించిన అధికారులు త్వరలో పార్టీకి హాజరైన వారి వివరాలు ఆధారంగా వారిని కూడా బైండోవర్‌ చేయాలని నిర్ణయించారు. ఈ కేసు విచారణ జరిగే వరకు రెండు రోజులకు ఒకసారి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ఇదిలావుండగా ఆ పార్టీలో జబర్దస్త్‌ ఫేం ఒక యువతి పాల్గొన్నారని, ఆమె కోసమే ఇద్దరు యువకులు కొట్లాడుకున్నారని చెబుతున్నారు. ఈ విషయం పోలీసుల వద్ద ప్రస్తావించగా స్పందించకపోవడం విశేషం.


నేడు నీట్‌ పీజీ పరీక్ష

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని మూడు కేంద్రాల్లో ఆదివారం నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌స్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పరీక్షకు 1,947 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు షీలానగర్‌, చినముషిడివాడల్లోని ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న పరీక్షకు అభ్యర్థులు అర్ధగంట ముందు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.


నాలుగు గ్రామీణ మండలాల్లో 75.88 శాతం బీసీ ఓటర్లు

ఎస్సీ ఓటర్లు 9.49ు, ఎస్టీ ఓటర్లు 0.65ు

ఏడో తేదీన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల తుది జాబితా విడుదల

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల పరిధిలో గల 79 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై ఒకపక్క కసరత్తు జరుగుతుండగా, మరోపక్క పంచాయతీ ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా నాలుగు మండలాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేసిన అధికారులు అభ్యంతరాలకు శుక్రవారం వరకు గడువిచ్చారు. అయితే ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. ముసాయిదా జాబితా మేరకు గ్రామీణ ప్రాంతంలో మొత్తం 1,62,407 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,23,250 (75.88 శాతం) మంది వెనుకబడిన తరగతుల (బీసీ)కు చెందినవారు ఉన్నారు. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన ఓటర్లు 13,795 మంది (9.49 శాతం), షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన ఓటర్లు 1,059 (0.65 శాతం) ఉండగా, ఓపెన్‌ కేటగిరీకి చెందిన ఓటర్లు 23,561 (14.05 శాతం) ఉన్నారు. మండలాల వారీగా చూస్తే పెందుర్తిలో మొత్తం ఓటర్లు 31,125 మంది ఉండగా వీరిలో బీసీలు 24,952, ఎస్సీలు 2,155, ఎస్టీలు 51 మంది, ఇతరులు 3,967 ఉన్నారు. ఆనందపురం మండలంలో మొత్తం ఓటర్లు 51,951 మంది ఉండగా వారిలో బీసీలు 42,120 మంది, ఎస్సీలు 4,373 మంది, ఎస్టీలు 807 మంది, ఇతరులు 4,651 మంది, భీమిలి మండలంలో మొత్తం ఓటర్లు 36,493 మంది ఉండగా బీసీలు 24,151 మంది, ఎస్సీలు 2654 మంది, ఎస్టీలు ముగ్గురు, ఇతరులు 10,135 మంది ఉన్నారు. పద్మనాభం మండలంలో 42,388 మంది ఓటర్లు ఉండగా బీసీలు 32,766 మంది, ఎస్సీలు 4616, ఎస్టీలు 198 మంది, ఇతరులు 4,808 మంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల తుది జాబితా వచ్చే నెల ఏడో తేదీన విడుదలచేస్తారు. నాలుగు మండలాల్లో 79 గ్రామ పంచాయతీల్లోని 802 పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా ఆదివారం విడుదల చేయనున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:46 AM