మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:56 AM
ఐటీ దిగ్గజ కంపెనీ ‘క్యాప్‌జెమినీ’ ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు నగరానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
పార్టీ కార్యాలయంలో వినతుల స్వీకరణ
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
ఐటీ దిగ్గజ కంపెనీ ‘క్యాప్‌జెమినీ’ ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు నగరానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి అప్యాయంగా పలకరించారు.
ముగిసిన ఏసీబీ సోదాలు
టౌన్‌ప్లానింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారులు రెండు రోజుల కిందట ప్రారంభించిన సోదాలు బుధవారం రాత్రి ముగిశాయి. పెందుర్తి జోన్‌లో ప్రభుత్వ భూమిలో కల్యాణ మండపం నిర్మాణానికి టౌన్‌ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడంపై ఏసీబీ అధికారులు లోతుగా సమాచారం సేకరించినట్టు తెలిసింది. ప్లాన్‌కు దరఖాస్తు పెట్టినప్పుడు ఎవరు పరిశీలించారు?, దరఖాస్తుతోపాటు జత చేసిన డాక్యుమెంట్లపై ఏం రిమార్కులు రాశారు?, వాటిపై ఫిర్యాదు అందినప్పుడు ప్లాన్ జారీ ప్రక్రియను ఆపారా?, లేదా?, తహశీల్దార్ ప్రభుత్వ భూమి అని నివేదిక ఇచ్చిన తరువాత ప్లాన్ ఉపసంహరించారా?, లేదా?...వంటి వివరాలపై పెందుర్తి జోన్ ఏసీపీ రామలింగేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అలాగే రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకున్న భవనంలో బెహరా ఆస్పత్రి నిర్వహిస్తుంటే నోటీసులు ఏమైనా ఇచ్చారా?, లేదా? అనేదానిపై కూడా ఆరా తీశారు. వారి వాంగ్మూలంతోపాటు తమ పరిశీలనతో గుర్తించిన అక్రమాలపై సమగ్ర నివేదికను తయారుచేసి గురువారం ఏసీబీ ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు
జిల్లాకు పెట్టుబడి సాయం కింద రూ.10.84 కోట్లు మంజూరు
సిరిపురం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
రైతుల బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కానున్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో అర్హులైన వారి జాబితాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. పీఎం కిసాన్ కింద 17,050 మందికి రూ.3.41 కోట్లు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 18,573 మందికి రూ.7.43 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం రూ.10.84 కోట్లు మంజూరైనట్టు జిల్లా వ్యవసాయాధికారి అప్పలస్వామి తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాలను అమలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షకు 95.56 శాతం హాజరు
మద్దిలపాలెం, మార్చి12 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కామర్స్ పరీక్షకు 95.56 శాతం హాజరు నమోదైంది. 64 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 2,626 మంది హాజరవ్వగా, 122 మంది గైర్హాజరయ్యారు. బ్యాక్‌ల్యాగ్ విద్యార్థులకు కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు డ్రాలో వచ్చిన సెట్-1 ప్రశ్నపత్రాన్ని ఇచ్చామని ఆర్‌ఐవో మురళీధర్ తెలిపారు.