నగరానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:17 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడె వెంకట పట్టాభి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, నాయకులు కిమిడి మల్లిక్ నాయుడు, పీవీజీ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని పలువురు నాయకులతో మాట్లాడారు. రాత్రికి అక్కడే బస చేశారు. గురువారం క్యాప్‌జెమినీ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
ఎన్‌టీపీసీ రెండో యూనిట్‌లో విద్యుదుత్పత్తికి బ్రేక్
పరవాడ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల సింహాద్రి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ)లోని రెండో యూనిట్ (500 మెగావాట్ల సామర్థ్యం)లో ఉత్పత్తికి బుధవారం సాయంత్రం అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఉత్పత్తి అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. మిగతా ఒకటి, మూడు, నాలుగు యూనిట్‌లలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతుందని అధికారులు తెలిపారు.
సరకు రవాణాలో వాల్తేరు రైల్వే రికార్డు
24 రోజుల ముందే లక్ష్య సాధన
డీఆర్‌ఎం లలిత్ బొహ్రా
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
వాల్తేరు రైల్వే డివిజన్ సరకు రవాణాలో రికార్డు సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 78.45 మిలియన్ టన్నులు రవాణా చేయాలనేది లక్ష్యం కాగా మార్చి నెల పూర్తి కాక ముందే ఈ నెల ఏడో తేదీ నాటికే 78.464 మిలియన్ టన్నులు పూర్తిచేసింది. ఇది డివిజన్ చరిత్రలో రికార్టు అని డీఆర్‌ఎం లలిత్ బొహ్రా బుధవారం విలేకరులకు తెలిపారు. గత ఏడాది అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే మార్చి ఏడో తేదీ నాటికి 67.254 మిలియన్ టన్నులు సరకు రవాణా చేశామని, దాంతో పోల్చితే ఈ ఏడాది 16.5 శాతం అభివృద్ధి రేటు సాధించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు, భద్రతకు సంబంధించిన సమస్యలు, మౌలిక వసతులకు సంబంధించిన పనులు చేయాల్సి వచ్చినప్పటికీ అనుకున్న లక్ష్యం ముందుగానే సాధించామన్నారు. వినియోగదారులకు ఉపయోగపడే నిర్ణయాలు, వాటాదారులతో కలిసి పనిచేయడం, ఆపరేషనల్ సామర్థ్యం పెంచుకోవడం, సిబ్బందిని సమర్థంగా సమన్వయం చేసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని, అధికారులు, సిబ్బందిని అభినందించారు.