మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:42 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు విందు ఇచ్చారు.
కుటుంబ సభ్యులతో హాజరైన స్పీకర్, మంత్రి, అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యేలు
అనకాపల్లి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు విందు ఇచ్చారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన వినతుల పరిష్కారం ఏ దశలో ఉన్నాయో లోకేశ్ వివరించారు. అందరూ ఒకచోట కూర్చొని కొద్దిసేపు సరదా సంభాషణలతో గడిపారు. అనంతరం అంతా కలిసి విందు ఆరగించారు. ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు మంగళగిరి చేనేత చీరలను లోకేశ్ బహూకరించారు. ఆత్మీయ సమావేశం ముగిసిన తరువాత అందరినీ గేటు వరకు సాగనంపారు. లోకేశ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేశ్, మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.