Share News

నేడు మంత్రి లోకేశ్‌ రాక

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:43 AM

ఆసియాలోనే ప్రముఖ ఆస్పత్రిగా పేర్గాంచిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ (ఏఐజీ) విశాఖ వాసులకు అందుబాటులోకి రానుంది.

నేడు మంత్రి లోకేశ్‌ రాక

ఎండాడలో ఏఐజీ ఆస్పత్రికి శంకుస్థాపన

గంభీరంలో ‘ప్రేమ ఉదయం’ ప్రారంభం

విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

ఆసియాలోనే ప్రముఖ ఆస్పత్రిగా పేర్గాంచిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ (ఏఐజీ) విశాఖ వాసులకు అందుబాటులోకి రానుంది. ఎండాడలో నిర్మించనున్న ఆస్పత్రికి సోమవారం రాష్ట్ర విద్యా, ఐటీశాఖా మంత్రి నారా లోకేశ్‌ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తొమ్మిదివేల మందికి ఉద్యోగాలను కల్పించే స్థాయిలో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి స్థాయిలోనే ఎని మిది సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లతో 50కుపైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తారు.

గంభీరంలో ‘ప్రేమ ఉదయం’ ప్రారంభం

నగర పర్యటనకు వస్తున్న మంత్రి నారా లోకోశ్‌ గంభీరంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన సమగ్ర సామాజిక సేవా కేం ద్రం ‘ప్రేమ ఉదయం’, స్నేహ సంధ్య ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌ను సోమవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. పద్మశ్రీ డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణ సహకారం, విరాళంతో ప్రేమ ఉదయం ఏర్పాటుచేశారు. విద్య, సామాజిక సంక్షేమం, ఆరోగ్య, కమ్యూనిటీ సేవలను ఒకే ప్రాంగణంలో అందించేలా దీనిని తీర్చిదిద్దారు. అంతకుముందు హరేకృష్ణ వైకుంఠంలోని రాధా మదన్‌మోహన్‌ ఆలయాన్ని సందర్శించనున్న మంత్రి అక్షయ పాత్ర ఫౌండేషన్‌ కేంద్రీకృత వంటశాలను సందర్శిస్తారు. అనంతరం అక్కడే నిర్మించ నున్న రాధాకృష్ణ ఆలయానికి భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ శ్రీభరత్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరవుతారు.


జిల్లాలో మరో రెండు ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లు

మధురవాడ, దువ్వాడలో ఏర్పాటు

ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన

విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కొత్తగా రెండు ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేయాలని కోరుతూ ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా పరిధిలో ప్రస్తుతం భీమిలి, సీతమ్మధార, మహరాణిపేట, పెందుర్తి, గాజువాక, గోపాలపట్నం ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. వీటికి ఎస్‌హెచ్‌ఓలుగా ఇన్‌స్పెక్టర్లు వ్యవహరిస్తున్నారు. వీటి పరిధిలో ఐదు లక్షలు వరకు జనాభా ఉండడంతో పర్యవేక్షణ, పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గాజువాక, పెందుర్తి, గోపాలపట్నం ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్ల నుంచి కొంత పరిధిని తగ్గించి దువ్వాడలో ఒకటి, భీమిలి, సీతమ్మధార స్టేషన్ల పరిధి నుంచి కొంత ప్రాంతాన్ని తొలగించి మధురవాడ పేరుతో మరొక స్టేషన్‌ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో త్వరలోనే ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


యారాడ తీరంలో యువకుడి గల్లంతు

ఉత్తరప్రదేశ్‌ నుంచి రాఖీ పండగకు రాక

కుటుంబసభ్యులతో కలిసి తీరానికి

సముద్ర స్నానం చేస్తుండగా ప్రమాదం

మల్కాపురం/సింథియా, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు యారాడ బీచ్‌కు వచ్చిన ఓ యువకుడు స్నానానికి దిగి గల్లంతయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవిరల్‌సింగ్‌ తల్లితో కలిసి రాఖీ పండగ కోసం మల్కాపురం సమీపంలోని నౌసేనాబాగ్‌లో ఉంటున్న మేనమామ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో బంధువులు 8 మంది కలిసి ఆదివారం ఉదయం 8 గంటలకు సరదాగా గడిపేందుకు యారాడ బీచ్‌కు వచ్చారు. తీరంలో కొద్దిసేపు ఆనందంగా గడిపిన అనంతరం అందరూ సముద్ర స్నానాలకు దిగారు. అవిరల్‌ సింగ్‌ సుమారు పది మీటర్ల వరకు ముందుకు వెళ్లి సాన్నం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద అల సముద్రంలోకి లాక్కొనిపోయింది. దీంతో బంధువులంతా పెద్దగా కేకలు వేశారు. వెంటనే స్పందించిన సమీపంలోని గత ఈతగాళ్లు సింగ్‌ కోసం గాలించినా ఫలితం కనిపించలేదు. స్థానికులు న్యూపోర్టు పోలీసులకు సమాచారం అందించడంతో వారు తీరానికి చేరుకుని కోస్ట్‌గార్డు, నేవీ సహకారంతో గాలింపు చర్యలు చేపట్టినా సింగ్‌ ఆచూకీ లభ్యం కాలేదు. చీకటిపడడంతో సోమవారం మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.


ఆస్పత్రుల్లో తనిఖీల్లేవ్‌!

నగర పరిధిలో గాలికి వదిలేసిన అధికారులు

అదనపు వసూళ్లపై దృష్టిసారించని వైనం

వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది అర్హతలు, బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ, రోగుల ఇబ్బందులపైనా స్పందన శూన్యం

ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న ప్రైవేటు ఆస్పత్రులు

విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రులను తరచూ తనిఖీ చేయాల్సిన అధికారులు కనీసం పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా తూతూమంత్రంగా తనిఖీలు జరిపి, చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆరోగ్యశాఖ అధికారుల ఉదాశీనత కారణంగా జిల్లాలోని ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా రోగులను దోచుకుంటున్నాయి. ఇటీవల నగర పరిధిలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారాలు వెలుగుచూశాయి.

తరచూ అధికారులు ఆస్పత్రులను తనిఖీ చేస్తే లోపాలు బయటపడతాయి. కానీ ఆదిశగా చర్యలు లేకపోవడంతో యథేచ్ఛగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయంటున్నారు. వీటితోపాటు ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది, వారి అర్హతలు వంటి అంశాలను అధికారులు తెలుసుకోవాల్సి ఉంది. ఆస్పత్రుల రిజిస్ర్టేషన్లు, వైద్యుల రికార్డులు, ఫైర్‌ సేఫ్టీ అనుమతులను పరిశీలించాలి. అయితే అడపాదడపా తనిఖీలు నిర్వహించడం, అది కూడా ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలకు ముందస్తు సమాచారాన్ని అందిస్తుండడంతో లోపాలు బహిర్గతం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

హడావిడితోనే సరి...

ఆస్పత్రులు, క్లినిక్‌లను నిరంతరం తనిఖీ చేయాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖదే. కానీ ఏవైనా ఇబ్బందులు తలెత్తితేనే అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే అప్రమత్తమై ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన తనిఖీలు నిర్వహిస్తుంటారు. మరో చోట సరోగసీకి సంబంధించిన విషయంలో చర్చ జరిగితే రెండు, మూడు ఐవీఎఫ్‌ సెంటర్స్‌ తనిఖీ చేయడం, తరువాత సైలెంట్‌ కావడం అధికారుల తీరుకు అద్దంపడుతున్నాయి. కొన్నిసార్లు ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే అధికారులు స్పందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దృష్టి సారించాల్సిందే...

ఆస్పత్రుల్లో చేరిన తరువాత నుంచి రోగి బయటకు వచ్చేవరకు వారికి అందించే వైద్యసేవలు, ఇచ్చే మందులు, ఇతర అంశాలపై రోగి బంధువులకు అనేక ఆస్పత్రుల్లో సమాచారం ఇవ్వడం లేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. రోగికి అందించే వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. ఈ అంశాలపై ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేయాలి. అత్యవసర వైద్య సేవలు అందించే విభాగాల్లో ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు, ల్యాబోరేటరీలు, ఫార్మసీలు, వ్యర్థాల నిర్వహణలో నిర్దేశిత నిబంధనలు పాటిస్తున్నారా.? ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అర్హత కలిగిన నిపుణులు న్నారా.? అన్నది పరిశీలించాలి. రోగి భద్రతకు సంబంధించి ఎంతవరకు ప్రాధాన్యతను ఇస్తున్నారన్నది పరిశీలించాల్సి ఉంది. విశాఖలో ప్రముఖ కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులు ఉండడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రోగులు వస్తుంటారు. వారికి మెరుగైన వైద్యసేవలను అందించాలంటే ఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:43 AM