సిటీలో మినీ రాడార్
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:34 AM
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో అనూహ్య మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో నగరాల్లో వాతావరణాన్ని అంచనా వేయడానికి స్థానిక సంస్థల ఆర్థిక సాయంతో మినీ రాడార్లు ఏర్పాటుచేయనున్నారు.
వాతావరణ మార్పుల పరిశీలన కోసం ఏర్పాటు
క్లౌడ్ బరస్ట్, వడగాడ్పులు, గాలి నాణ్యత వంటి అంశాలు అంచనాకు మినీ రాడార్ నుంచి డేటా ఎంతో కీలకం
భారత వాతావరణ విభాగానికి జీవీఎంసీ ప్రతిపాదన
ఐదారుచోట్ల ఆన్‌లైన్ అబ్జర్వేటర్లు కూడా...
విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో అనూహ్య మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో నగరాల్లో వాతావరణాన్ని అంచనా వేయడానికి స్థానిక సంస్థల ఆర్థిక సాయంతో మినీ రాడార్లు ఏర్పాటుచేయనున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో స్థానిక సంస్థలు/అక్కడుండే వాతావరణ శాఖ కలిసి రాడార్ల నిర్వహణతోపాటు రోజువారీ వాతావరణ బులెటిన్లు అందించడం జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన విశాఖలో మినీ రాడారు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి భారత వాతావరణ విభాగానికి గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన పంపింది.
విశాఖలో జనాభా పాతిక లక్షలు దాటింది. అన్ని రకాల వాహనాలు కలిపి 15 లక్షల వరకూ ఉన్నాయి. ఒకవైపు సమద్రం, మూడు వైపుల కొండలు కలిగిన నగరాన్ని బౌల్ ఏరియాగా వాతావరణ నిపుణులు పేర్కొంటారు. మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా గాలుల వేగం తక్కువగా ఉంటే నగరంలో కాలుష్యం తీవ్రత పెరుగుతుంది. పోర్టు, ఇతర పరిశ్రమల కాలుష్యం నగరం నుంచి బయటకు వెళ్లడానికి కొండలు అవరోధంగా ఉన్నాయి. దీనికితోడు నిర్మాణాలు పెరగడం, పచ్చదనం తగ్గడంతో అనేకచోట్ల వేసవికాలంలో హీట్ ఐలాండ్లు ఏర్పడుతున్నాయి. ఒక ప్రాంతంలో వర్షం కురిస్తే మరో ప్రాంతంలో ఎండ కాస్తోంది. సముద్ర తీరంలో నమోదైన ఉష్ణోగ్రతలకు నగర నడిబొడ్డున, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఉష్ణోగ్రతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంకా గాలి తేమ శాతం, కాలుష్య తీవ్రత, గాలుల వేగం ఇత్యాది అంశాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాలంటే వాతావరణంలో మార్పులను పసిగట్టే రాడార్ అవసరమని నిపుణులు అంటున్నారు. సుమారు 80 కి.మీ.పరిధిలో వాతావరణ మార్పులు అంటే క్లౌడ్ బరస్ట్, హీట్ వేవ్స్ (వడగాడ్పులు), గాలి నాణ్యత వంటి అంశాలు అంచనాకు మినీ రాడార్ నుంచి డేటా ఎంతో కీలకమని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇందుకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వ్యయం అవుతుంది.
ప్రస్తుతం కైలాసగిరిపై భారత వాతావరణ శాఖకు చెందిన వెదర్ డాప్లర్ రాడార్ ఉంది. దీని పరిధి 500 కిలోమీటర్లు. తుఫాన్‌లు, మేఘాల్లో మార్పులను పసిగట్టడానికి ఈ రాడార్ పంపిన డేటా ఉపయోగపడుతుంది. అయితే నగరంలో వాతావరణ మార్పులకు సొంతంగా మినీ రాడార్ ఏర్పాటుచేస్తే ఎప్పటికప్పుడు డేటా తీసుకుని ప్రజలకు హెచ్చరికలు జారీచేసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు అభిప్రాయపడ్డారు. నగరంలో ఒక ప్రాంతంలో వాతావరణానికి మరో ప్రాంతంలో వాతావరణానికి తేడా ఉంది. అందువల్ల నగరంలో ఐదారుచోట్ల ఆన్‌లైన్ అబ్జర్వేటర్లు ఏర్పాటుకు కూడా భారత వాతావరణ శాఖకు జీవీఎంసీ ప్రతిపాదనలు పంపింది. ఒక్కొక్క అబ్జర్వేటర్‌కు రూ.ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి రెండు శాఖల మధ్య సంప్రతింపులు జరుగుతున్నాయి.