Share News

గిరిజనులతో మమేకం

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:28 AM

గిరిజనులతో ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ మమేకమయ్యారు. రచ్చబండ ద్వారా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లెబాటలో ఈగల్‌ కార్యక్రమాన్ని మండలంలోని కె.కొత్తవలస గ్రామంలో సోమవారం ప్రారంభించారు.

గిరిజనులతో మమేకం
గిరిజన యువతకు వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేస్తున్న ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ

రచ్చబండ ద్వారా ఆదివాసీలతో ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ ముఖాముఖి

అందరి సహకారంతో గంజాయికి అడ్డుకట్ట వేస్తామని వెల్లడి

డుంబ్రిగుడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): గిరిజనులతో ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ మమేకమయ్యారు. రచ్చబండ ద్వారా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లెబాటలో ఈగల్‌ కార్యక్రమాన్ని మండలంలోని కె.కొత్తవలస గ్రామంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో ఆయన మాట్లాడారు. అందరి సహకారంతో గంజాయికి అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. గంజాయికి దూరంగా ఉండి ఆదాయాన్ని ఇచ్చే పంటలు సాగు చేసుకుంటున్నామని గిరిజనులు ముక్తకంఠంతో తెలిపారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీలు చదువుకుని ఆర్థిక స్థోమత లేక గిరిజన యువతీ, యువకులు ఇళ్లల్లోనే ఉంటున్నారని, వారికి ఉపాధి కల్పించాలని కోరారు. గిరి గ్రామాల్లో మద్యం, ఇతర అలవాట్లకు బానిసలైన యువతలో ఈగల్‌ టీమ్‌ నెల రోజుల్లోనే మార్పు తీసుకువచ్చిందని మాజీ సర్పంచ్‌ కొములు ఆనందం వ్యక్తం చేశారు. ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ గిరిజన యువతీ, యువకులకు ఉపాధి కల్పించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. అనంతరం 15 గ్రామాల గిరిజన యువకులకు వాలీబాల్‌ కిట్లు, గిరిజన చిన్నారులకు పలకలు, పెన్నులు, పుస్తకాలు, అట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల్‌ వింగ్‌ జిల్లా ఎస్పీ స్వరూపరాణి, పోలీసు అధికారులు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, అరకు సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:28 AM