గనుల శాఖ ఏడీపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:28 AM
రాంబిల్లి మండలం పంచదార్ల రెవెన్యూ పరిధిలోని ఉమాధర్మలింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో పరిమితికి మించి మట్టి, గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, మైనింగ్ చట్టాల అమలులో వైఫల్యం వంటి ఆరోపణలతో జిల్లా గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) మజ్జి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఈ శాఖ డైరెక్టర్ బాలచంద్రశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
పంచదార్ల అక్రమ మైనింగ్‌లో బాధ్యులపై చర్యలు
ఉత్తర్వులు జారీ చేసిన మైనింగ్ శాఖ డైరెక్టర్
గ్రావెల్ తవ్వకాలపై పర్యవేక్షణ లోపం, అక్రమాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించారని అభియోగం
అసిస్టెంట్ జియాలజిస్టుకు ఇన్‌చార్జి బాధ్యతలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
రాంబిల్లి మండలం పంచదార్ల రెవెన్యూ పరిధిలోని ఉమాధర్మలింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో పరిమితికి మించి మట్టి, గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, మైనింగ్ చట్టాల అమలులో వైఫల్యం వంటి ఆరోపణలతో జిల్లా గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) మజ్జి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఈ శాఖ డైరెక్టర్ బాలచంద్రశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాంబిల్లి మండలంలో ఫణిగిరిగా పేరుగాంచిన పంచదార్ల పుణ్యక్షేత్రానికి అతి చేరువలో అనుమతికి మించి భారీ ఎత్తున యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు చేపట్టడంతో పెద్ద, పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో పంచధారల ఉనికికి ముప్పు వాటిల్లిందంటూ స్థానికులు ఆందోళనలు చేశారు. తక్షణం ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గ్రావెల్ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. శాఖాపరమైన సర్వే, వివరణాత్మక తనిఖీ పూర్తయ్యేంత వరకు గ్రావెల్ తవ్వకాలను నిలిపివేయాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారులు ఈ నెల 16వ తేదీన ఆదేశాలు జారీచేశారు. గ్రావెల్ తవ్వకాలకు అనుమతి ఇవ్వని భూముల్లో కూడా తవ్వకాలు జరిపినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. క్వారీ లీజు హద్దులను కచ్చితంగా నిర్ధారించడం, తవ్వకాల పరిమాణాన్ని అంచనా వేయడం కోసం సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తరువాత రెవెన్యూ, గనులు-భూగర్భ శాఖ, భూగర్భ జలాలు, దేవదాయ శాఖల అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు. లీజు అనుమతి పొందిన పంచదార్ల సర్వే నంబరు-1లో 2.153 హెక్టార్ల ప్రాంతంలో 1,67,280.793 టన్నుల గ్రావెల్, లీజు సరిహద్దులు దాటి సమీపంలోని ప్రభుత్వ భూమిలో మరో 1,39,622.235 టన్నుల గ్రావెల్ తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు. గనుల శాఖ నుంచి పొందిన అనుమతుల ప్రకారం మైనింగ్ లీజుదారులు 1,04,000 టన్నుల గ్రావెల్ మాత్రమే తవ్వకాలు జరపాలి. మొత్తం మీద 2,02,903 టన్నుల గ్రావెల్ అదనంగా తవ్వినట్టు గుర్తించారు. దీంతో లీజుదారుడికి షోకాజ్ నోటీస్ జారీచేశారు. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా గ్రావెల్ తవ్వకాలపై పర్యవేక్షణలో పూర్తి విఫలమయ్యారని, అక్రమాలను గుర్తించి అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించారంటూ గనులు- భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మజ్జి శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మైనింగ్ నిబంధనల ప్రకారం క్వారీ లీజుదారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పురుషోత్తమనాయుడుకు ఇన్‌చార్జి బాధ్యతలు
అనకాపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ బాధ్యతలను అసిస్టెంట్ జియాలజిస్టు కె.పురుషోత్తమనాయుడుకు అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని సూచించింది.