తుది దశకు మిలాన్-2026
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:07 AM
విశాఖపట్నంలో నౌకాదళం నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.
సముద్రంలో ‘క్రాస్ డెక్’
నేడు ముగింపు
విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో నౌకాదళం నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన కార్యక్రమాలు బుధవారంతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన నేవీ అధికారులతో మిలాన్ సమావేశాలు నిర్వహించారు. సముద్రంలో ‘క్రాస్ డెక్’ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒక దేశానికి చెందిన నౌకను వేరొక దేశం వారు సందర్శించడాన్ని ‘క్రాస్ డెక్’గా వ్యవహరిస్తారు. బుధవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం పూర్తి చేసుకొని విదేశీ నౌకలను తిరిగి వెనక్కి వెళ్లనున్నాయి.
హౌసింగ్ పీడీ సత్తిబాబు బదిలీ
విజయనగరం డీఆర్‌వోగా నియామకం
ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా గీతాంజలి
పోర్టు డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌గా పుష్పమణి
పలువురు తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):
విశాఖ జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబుకు విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం... అందులో కొంతమందిని బదిలీ చేసింది. దీనిలో భాగంగా సత్తిబాబుకు విజయనగరం డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చింది. సింహాచలం భూపరిరక్షణ డిప్యూటీ కలెక్టర్ కె.గీతాంజలిని రాష్ట్ర ఎయిర్‌పోర్టు అథారిటీలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. తహశీల్దార్ల నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన వారిలో టి.గోవిందును విశాఖ కలెక్టరేట్‌లో విపత్తుల నిర్వహణ విభాగం డీపీఎంగా, డి.పుష్పమణి విశాఖ పోర్టు అథారిటీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. జిల్లాలో పద్మనాభం తహశీల్దారుగా పనిచేస్తున్న కె.ఆనందరావును పదోన్నతిపై అమరావతిలోని సీఆర్‌డీఏలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు.
ఇంటర్ పరీక్షకు 99.11 శాతం హాజరు
మద్దిలపాలెం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మంగళవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 99.11 శాతం మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 85 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 39,291 మంది హాజరవ్వగా, 353 మంది గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సీసీ టీవీల లైవ్ స్ర్టీమింగ్ ద్వారా పరీక్షల నిర్వహణను పరిశీలించారు.
కొత్త పింఛన్లపై స్పష్టత కరువు
దరఖాస్తు చేసుకోవచ్చునని సోషల్ మీడియాలో ప్రచారం
ఓపెన్ కాని వెబ్‌సైట్
తమకు అదేశాలు రాలేదంటున్న అధికారులు
అధికారుల వాట్సాప్ గ్రూపులో నమూనా దరఖాస్తు
విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):
కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరు కోసం ఏడాదిన్నరగా అనేకమంది ఎదురుచూస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తులు అందజేస్తున్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చునని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతుంది. కానీ, తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల గ్రామ/వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామ/వార్డుగా మార్చారు. ఈ నేపథ్యంలో స్వర్ణ గ్రామ/వార్డులలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని జోరుగా ప్రచారం కావడంతో అర్హులైనవారు తమకు సమీపంలోని కార్యాలయాలకు వెళ్లి సిబ్బందిని సంప్రతిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి తమకు అటువంటి సమాచారం అందలేదని సిబ్బంది స్పష్టంచేస్తున్నారు. పింఛన్ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా కొత్త పింఛన్ల కోసం ఒక దరఖాస్తు నమూనాను మాత్రం అన్ని జిల్లాల అధికారులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లో ఇటీవల పోస్టు చేశారు. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి నిబంధనలతో కూడిన నమూనా ఉన్నతాధికారులు తయారుచేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారనేది చెప్పడం లేదు. అందుకే అధికారికంగా ప్రకటన చేయలేకపోతున్నామని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అన్నిరకాల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తుంటారు. కొత్త పింఛన్ల దరఖాస్తు విషయంపై ఎటువంటి సమాచారం లేదని డీఆర్‌డీఏ అధికారులు స్పష్టంచేశారు. పింఛన్ తీసుకుని వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు మాత్రం కొత్తగా మంజూరుచేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1.6 లక్షల మంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.