Share News

ప్రైవేటు నుంచి వలస

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:36 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారడానికి మండలంలోని పిండ్రంగి ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఒక ఉదాహరణగా చెప్పాలి.

ప్రైవేటు నుంచి వలస

పిండ్రంగి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గణనీయంగా పెరిగి ప్రవేశాలు

గత ఏడాది 67 మంది.. ఈ ఏడాది 93కు పెంపు

కె.కోటపాడు, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారడానికి మండలంలోని పిండ్రంగి ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఒక ఉదాహరణగా చెప్పాలి. గత విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 55 శాతానికిపైగా విద్యార్థులు పెరిగారు. ఒకటో తరగతి మినహా మిగిలిన నాలుగు తరగతుల్లో చేరిన వారంతా ప్రైవేటు పాఠశాలల నుంచి రావడం విశేషం.

పిండ్రంగి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో మొత్తం 67 మంది విద్యార్థులు వున్నారు. వీరిలో ఒకటో తరగతిలో 19 మంది, రెండో తరగతిలో 19 మంది, మూడో తరగతిలో 18 మంది, నాలుగో తరగతిలో 11 మంది కలిపి మొత్తం 67 మంది విద్యార్థులు వున్నారు. ఐదో తరగతిలో ఒక్కరు కూడా లేరు. నాలుగో తరగతికి చెందిన 11 మందిలో పది మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సీట్లు రావడంతో టీసీలు తీసుకొని వెళ్లిపోయారు. దీంతో గత విద్యా సంవత్సరం నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలో మిగిలింది. 57 మంది మాత్రమే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి, ప్రభుత్వ పాఠశాలలో పథకాల అమలు, విద్యా బోధన గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో మాన్పించి, ప్రభుత్వ పాఠశాలలో చేర్చించడం మొదలుపెట్టారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో 19 మంది, రెండో తరగతిలో ఏడుగురు, మూడో తరగతిలో ఐదుగురు, నాలుగో తరగతిలో నలుగురు, ఐదో తరగతిలో ఒకరు చేరారు. పాత విద్యార్థులు 57 మంది, కొత్త విద్యార్థులు 36 మంది (వీరిలో 30 మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చారు) కలిపి ప్రస్తుతం 93 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి పాఠాలు బోదించడానికి హెచ్‌ఎంతో కలిపి ఐదుగురు టీచర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఈవో-1 కె.సత్యనారాయణ, ఎంఈవో-2 డీవీడీ ప్రసాద్‌, క్లస్టర్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ఎ.శేఖర్‌, గ్రామ పెద్దలు సోమవారం పాఠశాలను సందర్శించారు. హెచ్‌ఎం బి.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులు పి.నాయుడుబాబు, బి.ధనలక్ష్మి, కె.బంగారయ్య, పి.రమేశ్‌లను అభినందించారు. పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులతో గ్రూప్‌ ఫొటో దిగారు.

Updated Date - Jul 14 , 2026 | 01:36 AM