Share News

సదరంలో దళారుల దందా

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:21 AM

పెన్షన్‌ పొందేందుకు అవసరమైన విధంగా సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేయిస్తామంటూ దరఖాస్తు దారులను కొందరు దళారులు మభ్యపెడుతున్నారు.

సదరంలో దళారుల దందా

దరఖాస్తుదారులను మభ్య పెట్టేందుకు యత్నం

పెన్షన్‌ పొందేందుకు తగ్గట్టుగా సర్టిఫికెట్‌ ఇప్పిస్తామంటూ డబ్బుల వసూలు

ఆస్పత్రుల సిబ్బంది సహకారం ఉందనే ఆరోపణలు

ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్న దివ్యాంగులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పెన్షన్‌ పొందేందుకు అవసరమైన విధంగా సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేయిస్తామంటూ దరఖాస్తు దారులను కొందరు దళారులు మభ్యపెడుతున్నారు. సదరం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఆస్పత్రుల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందుకు ఆస్పత్రుల్లో పనిచేసే కొంతమంది సిబ్బంది సహకారాన్ని అందిస్తున్నారు.

జిల్లాలో కేజీహెచ్‌, ఈఎన్‌టీ, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, మానసిక వైద్యశాల, విమ్స్‌తోపాటు వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని అగనంపూడి ఏరియా ఆస్పత్రి, గోపాలపట్నం, భీమునిపట్నం, పెందుర్తిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌లో వారానికి రెండు రోజులు సదరం సర్టిఫికెట్ల మంజూరుకు శిబిరాలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారులకు ఉన్న వైకల్యాన్ని నిర్ధారించి సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లోనే జారీచేస్తున్నారు. ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అనర్హులకు సర్టిఫికెట్లు జారీచేస్తే చర్యలు ఉంటాయని వైద్యులను ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో అత్యంత పకడ్బందీగా వైకల్యాన్ని నిర్ధారించే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అయితే, వైద్యులతో మాట్లాడి పెన్షన్‌కు సరిపోయే విధంగా సర్టిఫికెట్‌ మంజూరు చేయిస్తామని దళారులు మాయమాటలు చెబుతున్నారు.

మోసపోతున్న అమాయకులు

సుదూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే ఎంతోమంది అక్కడున్న దళారుల మాయమాటలకు మోసపోతున్నారు. అర్హత ఉన్నవారు కూడా తమకు సదరం సర్టిఫికెట్‌లో పెన్షన్‌కు అవసరమైన స్థాయిలో వైకల్యాన్ని ధృవీకరిస్తారో లేదో అన్న భయంతో ముందుగానే దళారులకు డబ్బులు ఇస్తున్నారు. కొద్దిరోజుల కిందట అనకాపల్లి నుంచి వచ్చిన ఒక దివ్యాంగుడు కేజీహెచ్‌లో ఒకరికి ఇలానే డబ్బులు చెల్లించారు. అలాగే ప్రాంతీయ కంటి ఆస్పత్రికి వచ్చిన మరో మహిళ కూడా సుమారు రూ.3 వేలు చెల్లించింది. ఇందులో కొంత మొత్తాన్ని దళారులు ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి ముట్టచెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా బయటి వ్యక్తుల పట్ల ఆస్పత్రి అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని కోరుతున్నారు.

Updated Date - Jul 31 , 2026 | 01:21 AM