శొంఠ్యాం భూములపై వాలిన దళారులు!
ABN , Publish Date - May 25 , 2026 | 12:24 AM
ఆనందపురం మండలం శొంఠ్యాం సర్వేనంబరు 347లో ప్రభుత్వ భూములు కొట్టేయడానికి గ్రామానికి చెందిన కొందరు స్కెచ్ వేశారు.
ల్యాండ్ పూలింగ్ ప్రకటనతో హడావిడి
కూటమినేతలను ప్రసన్నం చేసుకుని యత్నాలు
రంగంలోకి బీమా ఏజెంట్, మాజీ వలంటీర్, డాక్యుమెంట్ రైటర్ , వైన్‌షాపు ఉద్యోగి, మాజీ వైసీపీ నేత
కొనుగోలుదారుల నుంచి ఇప్పటికే రూ.కోటి వసూలు
కొండ మధ్యన కొలతలు వేసి భూములకు హద్దుల నిర్ధారణ
మొత్తం వ్యవహారంపై జిల్లా యంత్రాంగం ఆరా!
విశాఖపట్నం/ఆనందపురం, మే 24 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం శొంఠ్యాం సర్వేనంబరు 347లో ప్రభుత్వ భూములు కొట్టేయడానికి గ్రామానికి చెందిన కొందరు స్కెచ్ వేశారు. ప్రభుత్వ అవసరాలు లేదా వీఎంఆర్‌డీఏ కోసం ల్యాండ్ పూలింగ్‌కు రెవెన్యూ అధికారులు జారీచేసిన ప్రకటనతో ఈ ప్రాం తంలోని కొందరు ముఠాగా ఏర్పడి దందా చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలోగా భూములు కొనుగోలు చేద్దామని కూటమి పార్టీ నాయకుల పేరుతో సుమారు రూ. రెండుకోట్లు వరకు బయానాలు వసూలు చేశారు. ఇందులో భాగంగా పలువురు రైతులను ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలున్నాయి. ల్యాండ్‌పూలింగ్ ప్రకటన మేరకు రెవెన్యూ అధికారులు చేసిన సర్వేపై శొంఠ్యాంలోని కొందరు రైతులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదుచేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పూర్తిస్థాయి విచారణకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది.
శొంఠ్యాం రెవెన్యూ పరిధి సర్వేనంబరు 347లో 452 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వానికి చెందిన కొండ ఉంది. కొండ అంచులో శొంఠ్యాం, మిందివానిపాలెం గ్రామానికి చెందిన సుమారు 20 నుంచి 30 మంది రైతుల ఆఽధీనంలో 50 ఎకరాల భూములున్నాయి. వీటిలో జీడితోటలు, ఇతర చెట్లు పెంచుతున్నారు. ఈ ప్రాంతంలో మరికొందరు రైతులకు డీపట్టాలున్నాయి. సర్వేనంబరు 347లో ప్రభుత్వ అవసరాలు/ వీఎంఆర్‌డీఏ కోసం ల్యాండ్ పూలింగ్ చేయాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించి, మూడు నెలల కిందట ఫారం-1 నోటిఫికేషన్ జారీచేశారు. విషయం తెలుసుకున్న కొందరు (కూటమి నేతలమని కొందరు, కీలకనేత, గత ప్రభుత్వంలో భూములు కొనుగోలుచేసిన దళారీ) రంగంలోకి దిగారు.
వైసీపీ దళారీ ఆధ్వర్యంలో...
గత ప్రభుత్వంలో భూములు కొనుగోలుకు అడ్వాన్స్‌లు ఇచ్చిన దళారీకి శొంఠ్యాం గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నేతలతో పరిచయాలున్నాయి. వీరిలో కొందరు కూటమిలో చేరారని చెబుతారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి ముందే గ్రామానికి చెందిన దళారులు రంగంలోకి దిగి సర్వేనంబరు 347లోని తోటలున్న రైతులతో మాట్లాడారు. పంచాయతీకి చెందిన బీమా ఏజెంట్, మాజీ వలంటీర్, డాక్యుమెంట్ రైటర్, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు ముఠాగా ఏర్పడి ఎకరాకు రూ.3 లక్షల రూ.4 లక్షలు తీసుకుని రైతులకు సగం అందజేశారు. శొంఠ్యాంలో ప్రభుత్వ భూములను రైతుల ద్వారా వేరే వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆనందపురం మండలానికి చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్‌లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో అస్మదీయులపేరిట కొంత భూమిని సర్వేలో నమోదుచేసేలా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌తో ఒక దళారీ మార్కెట్‌లో కొత్తగా వచ్చిన కారుకు అడ్వాన్స్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రైతుల ఆధీనంలో ఉన్న భూములకు ఆనుకుని కొండ మధ్య వరకు కొలతలు, రంగులు వేసి హద్దులు నిర్ణయించేశారు. నిబంధనల మేరకు కొండకింద నుంచి కొంత పైకి మాత్రమే ఆక్రమణలకు అనుమతి ఉంటుంది. దీనినే హాట్‌లైన్‌గా పిలుస్తారు. ఇది దాటేసి మరీ కొండను ఆక్రమించుకుని కొలతలు వేశారు. భూమి కొలతల్లో ఎన్‌ఏడీ ప్రాంతానికి చెందిన ప్రైవేటు సర్వేయర్ కీలక భూమిక పోషించారని, ఫలితంగా అతడికి ఐదెకరాలు ఇస్తామని దళారులు ప్రతిపాదించినట్టు సమాచారం. అంతేకాకుండా రైతుల పేర్లతో జాబితా సిద్ధం చేసి, దానిని రెవెన్యూ అధికారులకు అందజేసి రికార్డుల్లో అనుభవదారులుగా చేర్పించడానికి పైరవీలు జరిగాయనే ఆరోపణలున్నాయి.
నాటి దళారీయే...
వైసీపీ అధికారంలో ఉండగా అనేక అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం కూటమిలో చేరిన మాజీ నేత ఈ వ్యవహారంలో ప్రముఖ పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. గ్రామంలో ముఠా అక్రమాలపై కొంతమంది జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదుచేశారు. ఈలోగా రెవెన్యూ అధికారులు సర్వేనంబరు 347లో కొండపై సర్వే చేశారు. జిల్లా యంత్రాంగానికి అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు సర్వేచేసిన వివరాలను పెండింగ్‌లో ఉంచారు. నిబంధనల మేరకు సర్వే అనంతరం భూమిలో రైతులు ఎంతమంది? ఆక్రమణదారులు, అనుభవ దారులు, పట్టాభూములు ఉన్నవారి వివరాలతో జాబితా విడుదలచేసి గ్రామ సభ నిర్వహించాలి. కానీ ఫిర్యాదు మేరకు జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.
సర్వే మాత్రమే పూర్తిచేశాం
శొంఠ్యాం ల్యాండ్ పూలింగ్‌కు ఫారం-1 నోటిఫికేషన్ జారీచేసి సర్వేనంబరు 347లో భూములను సర్వే మాత్రమే చేశాం. ఆయా భూముల్లో ఎవరున్నారనేది నిర్ధారించలేదు. గ్రామసభ నిర్వహించి, జాబితాలో పేర్లపై అభ్యంతరాలు స్వీకరించిన తరువాత మరోసారి క్షేత్రస్థాయి సర్వేచేపడతాం.
- శ్రీనుబాబు, తహశీల్దార్, ఆనందపురం