శంకుస్థాపన చేసి ఏడాదైనా ప్రారంభం కాని మెట్టపాలెం రోడ్డు పనులు
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:27 PM
మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ మెట్టపాలెం రోడ్డుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శంకుస్థాపన చేసి ఏడాదైనా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు.
2025లో ఏప్రిల్‌లో పవన్‌కల్యాణ్ శంకుస్థాపన
నేటికి ప్రారంభం కాని రోడ్డు పనులు
అవస్థలు పడుతున్న గిరిజనులు
అనంతగిరి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ మెట్టపాలెం రోడ్డుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శంకుస్థాపన చేసి ఏడాదైనా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. పీఎం జన్‌మన్ పథకంలో జీలుగులపాడు నుంచి మెట్టపాలెం గ్రామానికి పీఎం జన్‌మన్ పథకంలో 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3.73 కోట్లు మంజూరయ్యాయి. 2025 ఏప్రిల్ నెలలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ డుంబ్రిగుడ పర్యటనలో మెట్టపాలెం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాదైనా నేటికీ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంపై గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్(పీఎం జన్‌మన్) పథకంలో మెట్టపాలెం గ్రామం ఎంపికైంది. దీంతో 2024 జూన్ నెలలో అప్పటి ఐటీడీఏ పీవో అభిషేక్ ఆ గ్రామాన్ని సందర్శించి, మౌలిక వసతులు కల్పనపై అనేక హామీలను ఇచ్చారు. మెట్టపాలెం గ్రామంలో 40 పీవీటీజీ గిరిజన కుటుంబాలకు చెందిన 200 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య నెలకొంది. గ్రామ సమీపంలో తాటిపూడి డ్యామ్‌ను ఆనుకుని గోస్తనీ నదిలోని గిరిజనులు చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి వలలు, బోట్లు, లోన్లు అందజేస్తామని అప్పటి పీవో ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని గిరిజనులు వాపోతున్నారు. భూములు లేకపోవడం, చేపల వేట అంతంతమాత్రంగా ఉండడంతో వలసలు పోవాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు పనులను ప్రారంభించి.. కష్టాలను తీర్చాలి
శోభ చిన్నలమ్మ, మెట్టపాలెం
మెట్టపాలెం గ్రామాన్ని సందర్శించి మా కష్టాలను గుర్తించాలి. రోడ్డు పనులకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు తెలియవు. అధికారులు రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి.